యూటీఐ నుంచి కొత్త ఈక్విటీ ఫండ్‌

18 Nov, 2017 01:32 IST|Sakshi

20 నుంచి ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ సిరీస్‌–V

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ యూటీఐ ఎంఎఫ్‌ తాజాగా ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ సిరీస్‌–  V (ఫైవ్‌)ని ప్రవేశపెడుతోంది. ఈ క్లోజ్డ్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఈ నెల 20న ప్రారంభమై డిసెంబర్‌ 4న ముగుస్తుందని సంస్థ ఈవీపీ, ఫండ్‌ మేనేజర్‌ వి.శ్రీవత్స శుక్రవారమిక్కడ విలేకరులకు చెప్పారు. ఈ ఫండ్‌ పరిమాణం సుమారు రూ. 500 కోట్లుగా ఉంటుందని, దీర్ఘకాలిక వ్యవధితో ఇన్వెస్ట్‌ చేయదల్చుకునేవారికి ఇది అనువైనదిగా ఉంటుందని శ్రీవత్స తెలిపారు.

ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో గరిష్టంగా 25–30 స్టాక్స్‌ ఉంటాయని తెలిపారు. ప్రధానంగా బ్యాంకింగ్, ఫార్మా, లాజిస్టిక్స్, లైఫ్‌స్టయిల్‌ రంగాల షేర్లు ఉంటాయన్నారు. బీఎస్‌ఈ–200 బెంచ్‌మార్క్‌ కన్నా 20–25 శాతం మేర అధిక రాబడులు అందించాలన్నది లక్ష్యమని చెప్పారాయన. ఫిక్సిడ్‌ డిపాజిట్లు మొదలైన వాటిపై రాబడులు తగ్గడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లవైపు చూస్తున్నారని శ్రీవత్స తెలిపారు.

మూడీస్‌ తాజాగా భారత రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసిన నేపథ్యంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు మరింతగా రాగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నిర్వహణలో ఉన్న అసెట్స్‌ (ఏయూఎం)పరంగా చూస్తే .. తమ ఫండ్‌ ఆరో స్థానంలో ఉందని, ఏయూఎం సుమారు రూ.2.5 లక్షల కోట్ల మేర ఉంటుందని శ్రీవత్స తెలిపారు.

మరిన్ని వార్తలు