త్వరలో కొత్త పసిడి విధానం

28 Dec, 2018 03:40 IST|Sakshi

కేంద్ర వాణిజ్య మంత్రి ప్రభు వెల్లడి  

న్యూఢిల్లీ: పసిడిపై కేంద్రం ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తోంది. త్వరలో బంగారంపై కొత్త విధానం ప్రకటించే అవకాశం ఉందని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు గురువారమిక్కడ తెలియజేశారు. పసిడి పరిశ్రమ వృద్ధి, ఆభరణాల ఎగుమతుల వృద్ధి ప్రధాన లక్ష్యాలతో తాజా విధాన రూపకల్పన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం భారత ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా 15 శాతంగా ఉంది. విధాన రూపకల్పనలో భాగంగా సంబంధిత వర్గాలతో రానున్న కొద్ది రోజుల్లో సమావేశం కానున్నట్లు ప్రభు తెలిపారు. పసిడిపై ప్రస్తుతం 10 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  

100 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు లక్ష్యం..
భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు మంత్రి ప్రభు తెలిపారు. వచ్చే రెండేళ్లలో 100 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు రప్పించటమనేది కేంద్రం లక్ష్యమని తెలిపారు. భారత్‌లో ఏ రంగాలు భారీ పెట్టుబడులను కోరుతున్నాయి? ఇందుకు ఏ దేశాల నుంచి పెట్టుబడులను పొందే అవకాశం ఉంటుంది? వంటి అంశాలపై వాణిజ్య, పరిశ్రమల పరిశ్రమల మంత్రిత్వశాఖ దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ దిశగా విదేశాలతో చర్చలకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.  

స్టార్టప్స్‌ పన్ను సమస్యల పరిష్కారం
స్టార్టప్స్‌ పురోగతికి కేంద్రం తగిన చర్యలన్నీ తీసుకుంటుందని సురేశ్‌ ప్రభు తెలిపారు. ప్రత్యేకించి ఏంజిల్‌ ఫండ్స్‌ నుంచి నిధుల సమీకరణలో స్టార్టప్స్‌ ఎదుర్కొంటున్న పన్ను సంబంధ సమస్యలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్టార్టప్స్, ఏంజిల్‌ ఇన్వెస్టర్స్‌ ఎదుర్కొంటున్న పన్ను సమస్యల పరిష్కార మార్గాలను సూచించడానికి గత వారం కేంద్రం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటైన సంగతి    తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా