కొత్త సర్కారుకు.. సవాళ్ల స్వాగతం

25 May, 2019 04:22 IST|Sakshi

ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలి

మందగమనానికి అడ్డుకట్ట వేయాలి

బ్యాంకుల మొండి బాకీల కష్టాలు తీర్చాలి

ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణకు చర్యలు ఉండాలి

ఆర్థికవేత్తల అభిప్రాయం

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి పలు సవాళ్లు స్వాగతం పలకనున్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. మందగమనానికి అడ్డుకట్ట వేయడం, ఉద్యోగాల కల్పన, ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవడం, మొండిబాకీల సమస్యల నుంచి బ్యాంకులను గట్టెక్కించడం మొదలైన వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుందని వివరించారు. అలాగే కంపెనీల కోసం స్థల సమీకరణ నిబంధనలను సరళతరం చేయడం, కార్మిక సంస్కరణలు చేపట్టడంతో పాటు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగం ఎదుర్కొంటున్న నిధుల సమస్యలను తీర్చడమూ కీలకమని పేర్కొన్నారు. అటు కరెంటు అకౌంటు లోటు (సీఏడీ)ని కట్టడి చేయడంతో పాటు ఉద్యోగార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడంపైనా దృష్టి సారించాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే అమలు చేస్తున్న వస్తు, సేవల పన్నులు, దివాలా చట్టం వంటి సంస్కరణల నుంచి ప్రజలకు తక్షణ ప్రయోజనాలు అందించేందుకు కేంద్రం ప్రయత్నించాల్సి ఉంటుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ఆసియా–పసిఫిక్‌ విభాగం చీఫ్‌ ఎకానమిస్ట్‌ షాన్‌ రోష్‌ చెప్పారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అసెట్‌ క్వాలిటీ సమస్యలను పరిష్కరించడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో నెలకొన్న ఒత్తిళ్లను తొలగించడంపైనా కసరత్తు చేయాలని పేర్కొన్నారు. ‘ప్రైవేట్‌ రంగానికి నిధులను అందుబాటులోకి తెచ్చేందుకు, వృద్ధికి ఊతమిచ్చేలా ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాంటివి దోహదపడతాయి‘ అని రోష్‌ తెలిపారు. వృద్ధి రేటు మందగించడానికి అడ్డుకట్ట వేయాలని, ద్రవ్యోల్బణాన్ని ఎగదోయకుండా దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాలు రూపొందించాలని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ చీఫ్‌ ఎకానమిస్ట్‌ దేవేంద్ర పంత్‌ తెలిపారు. ఆర్థిక స్థిరత్వా న్ని దెబ్బ తీయకుండా ప్రభుత్వ పెట్టుబడుల వ్యూ హాలు ఉండాలని, వ్యవసాయ రంగంలో ఒత్తిడిని తొలగించేందుకు, ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  

క్యాడ్‌ కట్టడి కీలకం..
వాణిజ్య యుద్ధభయాలు, అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటం, ఎగుమతులు మందగిస్తుండటం వంటి అంశాల కారణంగా కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌)పై ప్రతికూల ప్రభావం పడుతోందని పీడబ్ల్యూసీ ఇండియా లీడర్‌ (పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ విభాగం) రాణెన్‌ బెనర్జీ చెప్పారు. దీన్ని కట్టడి చేయడం కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా ఉంటుందని వివరించారు. దేశంలోకి విదేశీ మారకం రాక, పోక మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా వ్యవహరిస్తారు. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 2.5 శాతానికి (దాదాపు 16.9 బిలియన్‌ డాలర్లు) పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఇది జీడీపీలో 2.1 శాతంగా (13.7 బిలియన్‌ డాలర్లు)గా ఉంది.  

వాణిజ్య యుద్ధాల నుంచి ప్రయోజనం పొందాలి...
అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్న పరిస్థితులను భారత్‌ తనకు అనుకూలంగా మల్చుకోవడంపై దృష్టి పెట్టాలని రోష్‌ అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఇతర దేశాలతో దీటుగా పోటీపడేం దుకు పటిష్టమైన సంస్కరణల ఎజెండా అమలు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇక ప్రభుత్వ వ్యయాల్లో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుందని బెనర్జీ చెప్పారు. ఆదాయాలు అంచనాలను అందుకోకపోవడం, కొత్తగా ప్రకటించిన మరిన్ని సంక్షేమ పథకాలు మొదలైన వాటి కారణంగా ద్రవ్య లోటుపరమైన ఒత్తిళ్లు పెరగవచ్చని తెలిపారు.

మరోవైపు ఎకానమీలో డిమాండ్‌కు ఊతమివ్వడం, పెట్టుబడుల సెంటిమెంట్‌ను మెరుగుపర్చడమనేవి కొత్త ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యాలని ఈవై ఇండియా చీఫ్‌ పాలసీ సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. స్వల్పకాలికంగా చూస్తే ఇటు వినియోగం, అటు పెట్టుబడుల డిమాండ్‌ .. రెండింటికీ ఊతమిచ్చే చర్యలు అవసరమని చెప్పారు. రెపో రేటును మరో 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించడం, ప్రభుత్వ వ్యయాలకు అవసరమైన నిధులను ముందస్తుగా సమీకరించుకోవడం, పూర్తి ఏడాది బడ్జెట్‌ తేదీలను ముందుకు జరపడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంటుందని శ్రీవాస్తవ తెలిపారు.  

మరిన్ని వార్తలు