ప్రతిభకు పట్టం... రాజన్ నియామకం

6 May, 2014 00:55 IST|Sakshi
ప్రతిభకు పట్టం... రాజన్ నియామకం

అస్తానా/న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా రఘురామ్ జీ రాజన్ నియామకం ప్రతిభాపాటవాలకు పట్టంఅని ఆర్థికమంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. ఆయన నియమకాన్ని కొత్త ప్రభుత్వం గౌరవించాలని కూడా అన్నారు. కజికిస్తాన్ రాజధాని అస్తానాలో జరుగుతున్న ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) వార్షిక సమావేశాల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి చిదంబరం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ కామెంట్  చేశారు. రాజన్ ఆర్థిక విధానాలను కొందరు బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారని, ఒకవేళ బీజేపీ నేతృత్వంలో ఎన్‌డీఏ కూటమే అధికారంలోనికి వస్తే- ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్ కొనసాగడాన్ని ఇష్టపడకపోవచ్చని పుకార్లు వెలువడిన నేపథ్యంలో ఆర్థికమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

 గతంలో రాజన్ ఏమన్నారంటే...: గవర్నర్‌గా తనను తొలగించే అవకాశం ఉందన్న పుకార్లు షికార్లపై రాజన్ ఇప్పటికే కామెంట్ చేశారు. బీజేపీతో తనకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలు మీడియా సృష్టి మాత్రమేనని ఆయన అన్నారు. సెప్టెంబర్ 4న ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజన్, తన ఎనిమిది నెలల కాలంలో ద్రవ్యోల్బణం కారణంగా చూపెడుతూ, కీలక పాలసీ రేటు-రెపోను  పావుశాతం చొప్పున మూడుసార్లు పెంచారు. రాజన్‌కు అనుకూలంగా బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా ఇప్పటికే ఒక ప్రకటన చేయడం ఈ అంశానికి సంబంధించి మరో కోణం.  ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చినా తనకు సాధ్యపడితే రాజన్‌ను ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగించేందుకే మొగ్గు చూపుతానని ఆయన శనివారం పేర్కొన్నారు. రాజన్ మంచి గవర్నర్‌గా నిరూపించుకున్నారని, ఆ పదవిలో ఆయన కొనసాగాలన్నది తన అభిప్రాయమని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు