మహీంద్రాతో ఫోర్డ్‌ జాయింట్‌ వెంచర్‌

11 Apr, 2019 04:44 IST|Sakshi

ఒప్పందంపై తుది దశల్లో చర్చలు

భారత్‌ నుంచి పాక్షిక నిష్క్రమణ?

న్యూఢిల్లీ: భారత మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోవడం కష్టతరంగా మారుతుండటంతో విదేశీ ఆటోమొబైల్‌ కంపెనీలు క్రమంగా కార్యకలాపాలు తగ్గించుకుంటున్నాయి. అమెరికన్‌ సంస్థ జనరల్‌ మోటార్స్‌ .. భారత్‌లో కార్యకలాపాలను తగ్గించుకోవడంతో పాటు దేశీయంగా కార్ల విక్రయాలు నిలిపివేసింది. తాజాగా అదే బాటలో మరో అమెరికన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌ మోటార్‌ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్‌ తాజాగా భారత్‌లో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం)తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.

ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకునే దిశగా జరుపుతున్న చర్చలు తుది దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, ఫోర్డ్‌ భారత్‌లో స్వతంత్రంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఇకపై నిలిపివేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చర్చల సారాంశం ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబోయే జాయింట్‌ వెంచర్‌లో ఫోర్డ్‌కు 49 శాతం, మహీంద్రాకు 51 శాతం వాటాలు ఉంటాయి. ప్రస్తుతం భారత్‌లో తమ ఆటోమోటివ్‌ వ్యాపార కార్యకలాపాలు, అసెట్స్, ఉద్యోగులు మొదలైనవన్నీ కూడా ఫోర్డ్‌ ఈ కొత్త సంస్థకు బదలాయిస్తుంది.

ఈ డీల్‌ విలువ ఎంతన్నది వెల్లడి కానప్పటికీ.. మొత్తం మీద 90 రోజుల్లోగా ఒప్పందం పూర్తి కావొచ్చని అంచనాలు ఉన్నాయి. దీన్ని ఒకరకంగా భారత్‌ నుంచి ఫోర్డ్‌ పాక్షిక నిష్క్రమణగానే భావించవచ్చని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం ఫోర్డ్‌ భారత విభాగం మాతృసంస్థకు రాయల్టీలు చెల్లించాల్సి వస్తుండటం వల్ల కార్ల ధరలు కొంత అధికంగా ఉంటున్నాయి. ఒకవేళ డీల్‌ కానీ సాకారమైన పక్షంలో రాయల్టీల ప్రసక్తి ఉండదు కాబట్టి.. ఫోర్డ్‌ కార్ల రేట్లు తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

అలాగే తక్కువ వ్యయాలతో ఫోర్డ్, మహీంద్రా ఎప్పటికప్పుడు కొంగొత్త మోడల్స్‌ను వేగవంతంగా ప్రవేశపెట్టేందుకు ఈ జేవీ ఉపయోగపడనుంది. డీల్‌ కారణంగా భారత విభాగానికి వచ్చే నిధులతో నష్టాలను కొంత మేర భర్తీ చేసుకోవచ్చని ఫోర్డ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ డీల్‌ ఒకరకంగా రెండు సంస్థలకు ప్రయోజనకరంగానే ఉండగలదని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.  2017లోనే మహీంద్రాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం రెండు సంస్థలూ కలిసి కొత్తగా స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్స్, ఎలక్ట్రిక్‌ కార్స్‌ మొదలైన వాహనాలు నిర్మించాలని తలపెట్టాయి. ప్రస్తుతం మరో అడుగు ముందుకేసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.  

కష్టతరమైన భారత మార్కెట్‌..
భారత వాహనాల మార్కెట్‌ వృద్ధి గణనీయంగానే ఉన్నప్పటికీ.. ఇటీవల కొంత మందగించింది. గత ఆర్థిక సంవత్సరం కార్ల అమ్మకాల వృద్ధి కేవలం 3 శాతానికే పరిమితమైంది. 33 లక్షల కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాల వృద్ధి ఏకంగా 8 శాతం మేర నమోదైంది. ప్రస్తుతానికి విక్రయాల వృద్ధి మందగించినా 2023 నాటికల్లా ఏటా 50 లక్షల పైచిలుకు అమ్మకాలతో భారత్‌ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్‌గా అవతరించవచ్చని అంచనాలున్నాయి. అయితే, మారుతీ సుజుకీ వంటి దేశీ దిగ్గజం, కొరియాకు చెందిన హ్యుందాయ్‌ ఆధిపత్యం అధికంగా ఉన్న దేశీ మార్కెట్లో ఇతర దేశాల కార్ల కంపెనీలు పట్టు సాధించడం కష్టతరంగా ఉంటోంది. ఫోర్డ్‌ గత ఆర్థిక సంవత్సరం కేవలం 93,000 వాహనాలు మాత్రమే విక్రయించగలిగింది. గడిచిన 2 దశాబ్దాల్లో భారత మార్కెట్‌పై ఫోర్డ్‌ 2 బిలియన్‌ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టింది.  ఇన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నా,  భారత మార్కెట్లో ఫోర్డ్‌ వాటా కేవలం 3 శాతానికే పరిమితమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఫోర్డ్‌ తాజాగా ప్రత్యామ్నాయ అవకాశాలు పరిశీలిస్తోంది.  

మరిన్ని వార్తలు