భారత్‌లో కేటీఎం టాప్‌ గేర్‌

25 Mar, 2017 06:29 IST|Sakshi
భారత్‌లో కేటీఎం టాప్‌ గేర్‌

బైక్స్‌ విక్రయాల్లో భారీ వృద్ధి 
టాప్‌–1 మార్కెట్‌గా ఇండియా 
చిన్న పట్టణాల్లోనే అధిక సేల్స్‌  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో
స్పోర్ట్స్‌ బైక్స్‌ బ్రాండ్‌ కేటీఎం భారత్‌లో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తోంది. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల పరంగా రెండో స్థానంలో ఉన్న భారత్‌.. 2017లో తొలి స్థానానికి ఎగబాకేంత పనితీ రును కనబరుస్తోంది. మొదటి స్థానంలో ఉన్న యూఎస్‌ మార్కెట్‌తో పోలిస్తే భారత్‌ ప్రస్తుతం 1,000 యూనిట్లు మాత్రమే వెనుకబడి ఉంది. ఈ ఏడాది 50,000 బైక్‌లను విక్రయించాలని కేటీఎం ఇండియా టార్గెట్‌ విధించుకుంది. ఈ లక్ష్యాన్ని చేరితే ప్రపంచంలో కేటీఎంకు భారత మార్కెట్‌ టాప్‌–1గా నిలుస్తుంది. ఇటీవలే దేశంలో అప్‌గ్రేడెడ్‌ వెర్షన్లను ప్రవేశపెట్టిన ఈ సంస్థ ఔట్‌లెట్లను సైతం పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. ప్రస్తుతం 350 కేంద్రాలుండగా, 2018 డిసెంబరు నాటికి మరో 150 స్టోర్లు ప్రారంభించనుంది.

అమ్మకాల్లో అగ్రస్థానం డ్యూక్‌ 200దే
కేటీఎం భారత్‌లో డ్యూక్‌ 200, డ్యూక్‌ 250, డ్యూక్‌ 390, ఆర్‌సీ 200, ఆర్‌సీ 390 మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి హైదరాబాద్‌ ఎక్స్‌షోరూంలో రూ.1.4 లక్షల నుంచి రూ.2.3 లక్షల వరకూ ఉంది. డ్యూక్‌ 200 ఎక్కువగా అమ్ముడవుతున్న మోడల్‌. మొత్తం విక్రయాల్లో ఈ మోడల్‌ వాటా 45 శాతముంది. కంపెనీ 2011–12లో దేశంలో 2,200 బైక్స్‌ను మాత్రమే అమ్మింది. 2016–17లో ఈ సంఖ్య అనూహ్యంగా 36,000 యూనిట్లకు చేరింది. ఈ వేగం చూస్తుంటే దేశ మార్కెట్‌ తొలి స్థానానికి చేరడం ఖాయంగా కనపడుతోంది. తమ లక్ష్యమూ ఇదేనని బజాజ్‌ ఆటో ప్రోబైకింగ్‌ అంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నెలకు 320 బైక్‌లు రోడ్డెక్కుతున్నాయి.

లక్ష మార్కును దాటి..
ఇప్పటి వరకు భారత్‌లో 1,00,000 పైగా బైక్స్‌ అమ్ముడయ్యాయని ప్రోబైకింగ్‌ డివిజన్‌ సౌత్‌ హెడ్‌ గౌరవ్‌ రాథోర్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. తాము పోటీపడుతున్న ప్రీమియం బైక్స్‌ విభాగంలో దేశంలో నెలకు అన్ని కంపెనీలవి కలిపి 10–15 వేల యూనిట్లు అమ్ముడవుతున్నాయని గుర్తు చేశారు. ‘మూడేళ్ల క్రితం ఈ విభాగంలో నెలకు 5,000 యూనిట్ల లోపే విక్రయాలు జరిగాయి. 30 ఏళ్లలోపు యువకులే ఎక్కువగా కేటీఎంపై రైడ్‌ చేస్తున్నారు. యువతులకూ మా బైక్స్‌ అంటే మక్కువే. ఖరీదైన బైక్స్‌లో ఉండే ఫీచర్లను కేటీఎం మోడళ్లలో పొందుపరుస్తున్నాం. బైక్స్‌ డిజైన్‌ సైతం కుర్రకారు సై అనేలా ఉంటుంది. అందుకే సూపర్‌ బైక్స్‌ వాడేవారు ఇప్పుడు కేటీఎంకు మళ్లుతున్నారు’ అని వివరించారు.

భారత్‌ నుంచి 84 దేశాలకు...
దేశవ్యాప్తంగా జరుగుతున్న కంపెనీ విక్రయాల్లో మెట్రో నగరాల వాటా 40 శాతం మాత్రమే. చిన్న పట్టణాల్లోనూ కేటీఎం బైక్స్‌ పరుగెడుతున్నాయని శ్రీ వినాయక మోబైక్స్‌ డీలర్‌ ప్రిన్సిపల్‌ కె.వి.బాబుల్‌ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ప్రతి నెల గుంటూరులోని తమ షోరూంలో 12, తెనాలి ఔట్‌లెట్‌లో 3 బైక్స్‌ అమ్ముడవడం ఇందుకు నిదర్శనమన్నారు. చిన్న నగరాల కోసం కంపెనీ 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఔట్‌లెట్లను తెరుస్తోంది. మొత్తం 280 నగరాలు, పట్టణాల్లో కంపెనీ షోరూంలను నిర్వహించడం విశేషం. కేటీఎం ఇండియాలో బజాజ్‌కు 48 శాతం వాటా ఉంది. బజాజ్‌కు చెందిన చకన్‌ ప్లాంటులో కేటీఎం బైక్స్‌ తయారవుతున్నాయి. 84 దేశాలకు ఈ ప్లాంటు నుంచే బైక్స్‌ ఎగుమతి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు