కరోనా అనంతరం ‘‘బాహుబలి’’ఎవరు?

27 May, 2020 16:17 IST|Sakshi

సంక్షోభం తర్వాత ఇవే మార్కెట్‌ లీడర్స్‌

కోవిడ్‌19తో ప్రపంచ ఎకానమీలన్నీ అస్థావ్యస్థం అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే క్రమంగా దేశాలు లాక్‌డౌన్స్‌ను సడలించుకుంటున్నాయి. మరోవైపు కరోనా వాక్సిన్‌ ట్రయిల్స్‌ ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. అందుకే పలు బ్రోకరేజ్‌లు వచ్చే ఏడాది జీడీపీ వృద్ధిపై గట్టి నమ్మకంతో ఉన్నాయి. కరోనా అనంతరం పరిస్థితులు సద్దుమణిగి స్టాక్‌ మార్కెట్లో ర్యాలీ వస్తే ఏ రంగాలు జోరు చూపుతాయని సాధారణ ఇన్వెస్టర్‌ విశ్లేషణ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సంక్షోభానంతర రికవరీ దశలో రిటైల్‌, టెలికం, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, అగ్రి, పునర్వినియోగ ఇంధన వనరులు, కెమికల్స్‌ రంగాలు బాహుబలులుగా అవతరిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిలో కొన్ని ఇంత సంక్షోభ సమయంలో కూడా మంచి అప్‌మూవ్‌ చూపుతున్నాయి. దీంతో వీటిలో సత్తా ఎకానమీలో రికవరీ నాటికి ఉండకపోవచ్చని సామాన్య మదుపరి భయపడుతున్నాడు. కానీ, ఈ భయం నిరాధారమని, ఇప్పుడే బలంగా ఉన్న ఈ రంగాలు అనంతర కాలంలో మరింత బలంగా మారతాయని నిపుణులు భరోసా ఇస్తున్నారు. 
ఈ రంగాలకు చెందిన భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లె, డా.రెడ్డీస్‌, దివిస్‌ ల్యాబ్‌, టొరెంట్‌ ఫార్మా, బయోకాన్‌, అరబిందో ఫార్మా, కాడిలా హెల్త్‌కేర్‌ తదితర షేర్లపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా ఉన్నాయి. వీటి టార్గెట్‌ ధరలను కూడా పెంచాయి. మిడ్‌క్యాప్‌ విభాగంలో టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌, ఇప్కా, అదానీ గ్రీన్‌, అలంబిక్‌ ఫార్మా, జీఎంఎం పీఫాల్డర్‌, బేయర్‌ క్రాప్‌, అబాట్‌ ఇండియా, అజంతా ఫార్మా, ఎస్కార్ట్స్‌, జేబీ కెమికల్స్‌, నవీన్‌ ఫ్లోరిన్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఆల్కైల్‌ అమైన్స్‌, ఆల్కెమ్‌ ల్యాబ్‌ షేర్లపై పాజిటివ్‌గా ఉన్నట్లు ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు తెలిపాయి. మరోవైపు భారీ వాల్యూషన్లున్న స్టాకులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాయి. ఉదాహరణకు కన్జూమర్‌ రంగానికి చెందిన ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ కన్నా హెచ్‌యూఎల్‌ను ఎంచుకోవచ్చని సలహా ఇచ్చాయి. 

మరిన్ని వార్తలు