విమాన టికెట్ రద్దుపై భారీ రుసుములకు చెక్

14 Jul, 2016 01:07 IST|Sakshi
విమాన టికెట్ రద్దుపై భారీ రుసుములకు చెక్

ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

 న్యూఢిల్లీ: విమాన ప్రయాణ టికెట్ల రద్దుపై అనవసర చార్జీల భారం తొలగిపోనుంది. ఈ మేరకు సవరించిన నిబంధనలు ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బుధవారం ఇక్కడ తెలిపారు. టికెట్ రద్దు చేసుకుంటే విధించే చార్జీలు.... కనీస టికెట్ చార్జీ, ఇంధన సర్‌చార్జీని మించకూడదని, అన్ని రకాలు లెవీలు, పన్నులను తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశాలు కూడా జారీ చేసింది. వాటి ప్రకారం...

 టికెట్‌ను రద్దు చేసుకుంటే ఎంత మొత్తం వెనక్కి వస్తుందో ఎయిర్‌లైన్ సంస్థలు బుకింగ్ సమయంలోనే స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన విధానం, నిబంధనల వివరాలను తమ వెబ్‌సైట్లలోనూ ప్రదర్శించాలి. ఇటీవలి కాలంలో టికెట్ల రద్దుపై చార్జీలను ఎయిర్‌లైన్ సంస్థలు ఇష్టారీతిగా పెంచడంతో తాజా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. టికెట్ రద్దు చేసుకుంటే టికెట్ ధర, ఇంధన సర్‌చార్జీ పోను... విమానాశ్రయ అభివృద్ధి రుసుం (ఏడీఎఫ్), ప్రయాణికుల సేవా రుసుములను (పీఎస్‌ఎఫ్) ఎయిర్‌లైన్ సంస్థలు వెనక్కిచ్చేయాల్సి ఉంటుంది.

టికెట్‌ను రద్దు చేసుకుంటే ఆ చార్జీలను ఎయిర్‌లైన్ సంస్థ ప్రయాణికుల ప్రమేయం లేకుండా తన ఖాతాలోనే ఉంచేసుకోరాదు. ప్రయాణికుడి ఇష్టం మేరకే ఇది జరగాలి. అలాగే, టికెట్‌పై పేరులో తప్పు దొర్లితే సరి చేసేందుకు చార్జీ వసూలు చేయరాదు. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్ బుక్ చేసుకుని... రద్దు చేసుకుంటే ఆ చార్జీలు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఎయిర్‌లైన్ సంస్థపైనే ఉంటుంది. రద్దు రుసుముల చెల్లింపు ప్రక్రియ 30 పని దినాల్లో పూర్తి కావాలి.

మరిన్ని వార్తలు