లోక్‌సభలోకి సెబీ చట్ట సవరణ బిల్లు

5 Aug, 2014 01:16 IST|Sakshi
లోక్‌సభలోకి సెబీ చట్ట సవరణ బిల్లు

న్యూఢిల్లీ: సెబీకి మరిన్ని అధికారాలను కల్పించే సెక్యూరిటీ చట్టాల(సవరణ) బిల్లు-2014ను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఎట్టకేలకు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చినప్పటికీ.. పార్లమెంటులో ఆమోదముద్ర పడలేదు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును లోక్‌సభకు సమర్పించారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా సభకు హాజరుకాకపోవడంతో ఆయన బదులు తాను బిల్లును ప్రవేశపెట్టినట్లు సీతారామన్ పేర్కొన్నారు.

ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. మోసపూరిత పెట్టుబడి పథకాల(పోంజీ స్కీమ్‌లు)కు పూర్తిస్థాయిలో అడ్డుకట్టవేయడంతోపాటు దర్యాప్తులో భాగంగా ఏ ఇతర సంస్థల నుంచైనా సమాచారాన్ని కోరడానికి.. విచారణను వేగంగా పూర్తిచేసేందుకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అధికారం కూడా సెబీకి లభిస్తాయి. అంతేకాకుండా కాల్ డేటా రికార్డులను సైతం తీసుకునే పవర్ దక్కుతుంది. స్టాక్ మార్కెట్‌తో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలనే కాకుండా.. ఎవరినైనా సమాచారం కోసం పిలిపించే అవకాశం సెబీకి లభిస్తుంది.

 ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, స్టాక్ మార్కెట్లో మార్పులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా సెబీ అధికారాలు పెంచడమే ఈ బిల్లు ప్రధానోద్దేశమని నిర్మల చెప్పారు. కాగా, సెక్యూరిటీస్ కాంట్రాక్టుల(నియంత్రణ) బిల్లు-1956, డిపాజిటరీస్ చట్టం-1996లో సవరణలకు సంబంధించిన బిల్లులను కూడా ఆమె సభలో ప్రవేశపెట్టారు.

 స్వల్ప మార్పులు..: ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లులో ఆర్డినెన్స్ చేర్చిన కొన్ని అధికారాలకు సంబంధించి మార్పులు చేశారు. దీనిప్రకారం సెబీ ఏదైనా కేసులకు సంబంధించి సోదాలు, స్వాధీనాలు(సీజ్) చేపట్టాలంటే ముందుగా ప్రత్యేక కోర్టుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కేసుల స్వభావాన్నిబట్టి కనీస స్థాయిలో రూ.లక్ష-రూ.10 లక్షల వరకూ జరిమానాలు విధించే కొత్త నిబంధనలను కూడా బిల్లులో చేర్చారు.

>
మరిన్ని వార్తలు