పాత స్థలాల్లో   కొత్త నిర్మాణాలు! 

9 Jun, 2018 00:32 IST|Sakshi

వెయ్యి గజాల్లోపైతే నివాస; ఎక్కువైతే వాణిజ్య ప్రాజెక్ట్‌లు

రియల్‌ ఎస్టేట్, లొకేషన్‌! ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. లొకేషన్‌ మీద ఆధారపడే రియల్‌ బూమ్‌ ఉంటుంది. మరి, విద్యా, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే రియల్‌ ప్రాజెక్ట్‌లొస్తే? ప్రధాన నగరంలో స్థలం కొరత కాబట్టి రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడుతున్నాయి నిర్మాణ సంస్థలు! దీంతో పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలు రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో ప్రధాన నగరం నయా ప్రాజెక్ట్‌లతో కొనుగోలుదారులను రా.. రమ్మంటున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌: 30–40 ఏళ్ల నాటి పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లు చేయాలంటే నివాస సముదాయాలౖకైతే వెయ్యి గజాల వరకు, అంతకంటే ఎక్కువగా.. మెయిన్‌ రోడ్డుకు ఉన్న ఇళ్ల స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరంలో స్థల విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు సగానికి పైగా రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లు డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కిందే ఉంటాయి. డెవలపర్‌కు, స్థల యజమానికి మధ్య 50:50 అగ్రిమెంట్‌ ఉంటుంది. పంజగుట్ట, సోమాజిగూడ, నల్లకుంట, విద్యానగర్, హిమాయత్‌నగర్, బేగంపేట, అమీర్‌పేట్, బర్కత్‌పుర, తార్నాక, మారెడ్‌పల్లి, పద్మారావ్‌నగర్‌ వంటి పాత రెసిడెన్షియల్‌ స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్‌ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరంలో నిర్మిస్తున్న వాటిల్లో 90 శాతం రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లే. 

రీ–డెవలప్‌మెంట్‌ ఎందుకంటే? 
సాధారణంగా ప్రధాన నగరంలో ఖాళీ స్థలాల కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇల్లు పాతపడిందనో లేక స్థల యజమాని ఆర్ధిక పరిస్థితుల కారణంగానో రీ–డెవలప్‌మెంట్‌ కోసం ముందుకొస్తారని బేగంపేట్‌లో ‘రామ్‌ ఎన్‌క్లేవ్‌’ పేరిట రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ చేస్తున్న ఓ డెవలపర్‌ తెలిపారు. ఇవే కాకుండా పాత స్థలాలను రీ–డెవలప్‌మెంట్‌కు ఇచ్చేందుకు మరికొన్ని కారణాలున్నాయి. అవేంటంటే.. 

తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకోవాలంటే స్థలం కొద్దిగా ఉంటుంది. అందుకే రీ–డెవలప్‌మెంట్‌కి ఇచ్చి అందులో వచ్చిన ఫ్లాట్లను స్థల యజమాని వారసులు తలా ఒకటి తీసుకుంటారు. పాత ఇళ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రస్తుత భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఉంటాయి. పైగా ఇప్పటి ట్రెండ్స్‌కు తగ్గట్టు భవన నిర్మాణం, ఎలివేషన్, వసతులుంటాయి. రీ–డెవలప్‌మెంట్‌కు ముందుకొచ్చే స్థల యజమానికి డెవలపర్‌ నుంచి మార్కెట్‌ విలువ 10–15 శాతం వరకు నాన్‌ రీఫండబుల్‌ కింద కొంత సొమ్ము వస్తుంది. కాబట్టి వ్యక్తిగత అవసరాలకు పనికొస్తాయి. స్థల యజమానికి వచ్చే ఫ్లాట్ల నుంచి ప్రతి నెలా అద్దె వస్తుంది. ఒకవేళ ఫ్లాట్‌ను విక్రయించుకుంటే మంచి ధర పలుకుతుంది.   స్థలం, అసెట్స్‌ విలువ పెరుగుతుంది. ఆయా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. 

నిర్మాణ వ్యయం 15 శాతం ఎక్కువ: రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లకు అగ్నిమాపక, విమానయాన, పర్యావరణ శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌వోసీ) పెద్దగా అవసరం ఉండదు. పైగా పాత స్థలాల టైటిల్స్‌ క్లియర్‌గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైంది డాక్యుమెంటేషన్‌ తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్మాణ అనుమతులూ త్వరగానే వచ్చేస్తాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలోని నిర్మాణంలో నాణ్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ వ్యయం 10–15 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ లిఫ్ట్, ట్రాన్స్‌ఫార్మర్, మోటర్‌ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కామన్‌ వసతుల వ్యయం తగ్గుతుంది. ఆయా ప్రాజెక్ట్‌లల్లో ఫ్లాట్ల అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి నిర్మాణం కూడా త్వరగా పూర్తవుతుంది. 

బేసిక్‌ వసతులుంటాయ్‌
స్థలం కొరత కారణంగా రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లల్లో బేసిక్‌ వసతులను మాత్రమే కల్పిస్తుంటారు. సోలార్‌ వాటర్, వీడియో డోర్‌ ఫ్లోర్, టెర్రస్‌ పైన గార్డెనింగ్, పార్కింగ్, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, లిఫ్ట్, జనరేటర్‌ బ్యాకప్‌ వంటి వసతులుంటాయి. అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్‌ యజమానులతో పెద్దగా ఇబ్బందులుండవు. కొత్త ప్రాజెక్ట్‌ కాబట్టి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలుగా 24 గంటల పాటు రవాణా సౌకర్యాలుంటాయి. షాపింగ్‌ మాల్స్, ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యా కేంద్రాలుంటాయి. 

ఎవరికేం లాభమంటే? 
రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లతో స్థల యజమానులకు, నిర్మాణ సంస్థలకు, కొనుగోలుదారులకూ అందరికీ ప్రయోజనకరమే! 
స్థల యజమాని: తన పాత స్థలంలో కొత్త భవనం రావటంతో పాటూ ముందస్తుగా కొంత సొమ్ము వస్తుంది. పైగా డెవలప్‌మెంట్‌ ఒప్పందం కింద తన వాటాగా కొన్ని ఫ్లాట్లూ వస్తాయి. 
నిర్మాణ సంస్థ: అభివృద్ధి చెందిన ప్రాంతం కావటంతో విక్రయాలూ త్వరగా పూర్తవుతాయి. దీంతో తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడి, లాభం తిరిగొస్తుంది.  
కొనుగోలుదారులు: మెరుగైన రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వైద్యం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని సొంతిల్లు ఉంటుంది.  

మరిన్ని వార్తలు