హ్యాకర్ల కొత్త ఎత్తుగడలు.. స్టార్టప్సే లక్ష్యం..

17 Aug, 2017 00:58 IST|Sakshi
హ్యాకర్ల కొత్త ఎత్తుగడలు.. స్టార్టప్సే లక్ష్యం..

డేటా లీక్‌ అయ్యిందంటూ హెచ్చరికలు
అటుపై సాయమందిస్తామంటూ హామీ
చివరకు సేవల పేరుతో ఆదాయం


ముంబై: మోసపూరిత ఈ–మెయిల్స్‌/కాల్స్‌.. బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు తెలుసుకోవడం.. క్రెడిట్‌ కార్డుల సమాచారం కొట్టేయడం.. ఇలా వివిధ మార్గాల్లో హ్యాకర్లు డబ్బు సంపాదిస్తున్నారు. ఇప్పుడు వీరు స్టార్టప్స్‌పై పడుతున్నారు. వీటిని భయపెట్టి ఆదాయం పొందాలని చూస్తున్నారు. అదెలాగంటే.. దేశీ క్రెడిట్‌ స్కోర్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ‘క్రెడిట్‌సేవ’ హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీని సర్వర్‌లో నిక్షిప్తమై ఉన్న దాదాపు 40,000 మంది రుణగ్రహీతల వివరాలు లీక్‌ అయ్యాయని ఒక యూరోపియన్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ దీన్ని హెచ్చరించింది.

జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు సాయమందిస్తామని హామీ కూడా ఇచ్చింది. అలర్ట్‌ అయిన క్రెడిట్‌సేవ సంస్థ వ్యవస్థలో ఎక్కడ లోపాలున్నాయో, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. కానీ లీక్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. దీంతో డేటా భద్రంగానే ఉందని, ఎవరి చేతుల్లోకి వెళ్లలేదని ఊపిరి పీల్చుకుంది. అయితే లండన్‌కు చెందిన ఒక బ్లాగర్‌ కూడా డేటా లీక్‌ జరిగిందని కథనం వడ్డించేసింది. కానీ క్రెడిట్‌సేవ సీఈవో సత్య విష్ణుభొట్ల మాత్రం డేటా లీక్‌ అవ్వలేదని, భద్రంగానే ఉందని స్పష్టం చేశారు.   

సమస్య సృష్టించేదీ...సొల్యూషన్‌ ఇచ్చేదీ వారే...
ఇక్కడ మరొక కొత్త సమస్య ఉత్పన్నమౌతోంది. కొందరు నిష్ణాతులైన సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌ ఇండియన్‌ కంపెనీలను భయపెడుతున్నారు. వీరు ఎలాంటి వారంటే వ్యాపారం కోసం సిస్టమ్‌ హ్యాక్‌ చేయడానికి కూడా వెనకాడరు. అంటే వారే సమస్యను సృష్టించి, దానికి సొల్యూషన్‌ను అందిస్తారు. స్టార్టప్స్‌ ఈ ఉదాహరణను ఒక హెచ్చరిక లాగా తీసుకోవాలని స్థానిక సెక్యూరిటీ సంస్థ ఒకటి హెచ్చరించింది. ఫిన్‌టెక్‌ విభాగంలో బిజినెస్‌కు సంబంధించి సెక్యూరిటీ అనేది ముఖ్యమైన అంశమని తెలిపింది. స్టార్టప్స్‌ ఎప్పుడూ వ్యాపార విస్తరణతో పాటు సైబర్‌ దాడులు, డేటా భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది.

స్టార్టప్‌ను నడిపించడం కష్టమైన పనే. మీ సిస్టమ్‌లో లోపాలున్నాయని, సమస్య పరిష్కారానికి మా సేవలు ఉపయోగపడతాయని కొందరు సెక్యూరిటీ కన్సల్టెంట్స్‌ మీ వద్దకు వస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో స్టార్టప్‌ నిర్వహణ మరింత కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీరి సేవలు తీసుకోవడానికి మనం నిరాకరిస్తే.. డేటా లీక్‌ అయ్యిందంటూ వీరు మీడియాకు తెలియజేస్తారు. మా పోర్ట్‌ఫోలియోలోని ఒక కంపెనీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మీ వరకు కూడా ఈ సమస్య రావొచ్చు. తస్మాత్‌ జాగ్రత్త.
 
–  స్టీవెన్‌ టంగ్‌ , బూట్‌క్యాంప్‌ ఆసియా
మేనేజింగ్‌ డైరెక్టర్, క్రెడిట్‌సేవ ఇన్వెస్టర్‌

మరిన్ని వార్తలు