తత్కాల్‌ బుకింగ్‌కు కొత్త రూల్స్‌...

17 Apr, 2018 15:42 IST|Sakshi

సాక్షి, ముంబై : ప్రయాణికుల సౌలభ్యార్థం భారతీయ రైల్వే అనేక చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే తత్కాల్‌ టిక్కెట్ల బుకింగ్‌ కోసం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. ఐఆర్‌టీసీ  లెక్కల ప్రకారం ప్రతిరోజు 13 లక్షలమంది తత్కాల్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకుంటున్నట్లు తెలిసింది. నూతనంగా ప్రవేశపెట్టనున్న తత్కాల్‌ నిబంధనల వల్ల టిక్కెట్‌ రిజర్వేషన్‌ విధానం మరింత బలోపేతం చేయడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు.

అమల్లోకి రానున్న కొత్త తత్కాల్‌ రూల్స్‌...
1 ఇక మీదట ఒక యూజర్‌ఐడీ మీద నెలలో కేవలం 6 టికెట్లను మాత్రమే బుక్‌ చేసుకునే వీలుంది. ఆధార్‌ కార్డు ఉపయోగించి టికెట్లు బుక్‌ చేసుకునే వారు 12 టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు అది కూడా కేవలం ఉదయం 8 - 10 గంటల మధ్య మాత్రమే బుక్‌ చేసుకునేందుకు వీలుంది.

2 రిజిస్టర్డ్‌ యూజర్స్‌ కోసం రూపొందించిన సింగిల్‌ పేజ్‌/ క్విక్‌ బుక్‌ సేవలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అందుబాటులో ఉండబోవని తెలిపింది. అలానే ఒక్క యూజర్‌కి ఒక్క లాంగ్‌ ఇన్‌ సెషన్‌ మాత్రమే అందుబాటులో ఉండనుంది. యూజర్‌ లాగిన్‌ అయ్యే సమయంలోనే ప్రయాణికుడి వివరాలు, పేమెంట్‌ పేజీలతో పాటు క్యాప్చా కూడా అందుబాటులో ఉండనుంది.

3. ఇక నుంచి మరింత భద్రత కల్పించడం కోసం అప్లికేషన్‌ను పూర్తిగా నింపిన తర్వాత ప్రయాణికుల వ్యక్తిగతమైన ప్రశ్నలు అంటే యూజర్‌ పేరు, ఫోన్‌ నంబరు లాంటి ప్రశ్నలు అడగనున్నారు.

4 .  ఏజెంట్లు మొదటి 30 నిమిషాలు తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకునే వీలు లేదు.

5. ఇక మీదట తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కి కూడా నిర్ణీత సమయాన్ని కేటాయించనున్నారు. కొత్త రూల్సు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుని పూర్తి వివరాలను అప్లికేషన్‌లో నింపిన తర్వాత క్యాప్చా కోసం కేవలం 25 సెకన్లు, పెమెంట్‌ పేజీలో క్యాప్చా కోసం 5 సెకన్ల సమయాన్ని మాత్రమే ఇవ్వనున్నారు.

6. పేమెంట్‌ చేయడం కోసం ఇక నుంచి 10 సెకన్ల సమయాన్ని మాత్రమే ఇవ్వనున్నారు. చెల్లింపుల సమయంలో ఓటీపీ తప్పనిసరి.

7. ఆన్‌లైన్‌లో ఏసీ కోచ్‌లలో బెర్తులు బుక్‌ చేసుకోవాలనుకునే వారు ఉదయం 10 గంటల ప్రాంతంలో, స్లీపర్‌ క్లాస్‌లో బెర్తులు బుక్‌ చేసుకోవాలనుకునేవారు ఉదయం 11 గంటల సమయంలో బుక్‌ చేసుకోవాలి.

8.  రైలు నిర్ధేశించిన సమయం కన్నా 3 గంటలు ఆలస్యంగా బయలుదేరినట్లయితే పూర్తి రైలు చార్జీలు, తత్కాల్‌ చార్జీలు ప్రయాణికునికి చెల్లిస్తారు.

9.  రైళ్ల మార్గాలు మళ్లించినా, ప్రయాణికులు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నా, వారికి పూర్తి రుసుము చెల్లించనున్నారు.

10. ఫస్ట్‌ క్లాసులో టికెట్‌ బుక్‌ చేసుకుని సెకండ్‌ క్లాస్‌ లేదా జనరల్‌లోకి టిక్కెట్‌ను మార్చుకుంటే చార్జీల మధ్య ఉన్న తేడాను ప్రయాణికుడికి తిరిగి చెల్లిస్తారు.

మరిన్ని వార్తలు