కనుసన్నల్లో స్మార్ట్ఫోన్స్!

6 Jul, 2016 01:00 IST|Sakshi
కనుసన్నల్లో స్మార్ట్ఫోన్స్!

పాస్‌వర్డ్స్‌కు ఇక కాలం చెల్లినట్లే..!
ఐరిస్, ఫింగర్ ప్రింట్ స్కానర్స్‌తో మోడళ్లు
ఫీచర్లతో పోటీపడుతున్న కంపెనీలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యక్తిగత, విలువైన సమాచారం అంతా మొబైల్స్‌లో నిక్షిప్తం చేయడం సర్వ సాధారణమవుతోంది. ఈ సమాచారం భద్రంగా ఉండాలంటే ఇప్పటి వరకు వినియోగదారులు తమ మొబైల్స్‌కు పాస్‌వర్డ్ లేదా ప్యాటర్న్ పెట్టుకునేవారు. ఇప్పుడీ విధానానికి కాలం చెల్లుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టాయి. ఇది చాలదన్నట్టు కనురెప్ప వాల్చి తెరిస్తే ఫోన్ తెరుచుకునేలా ఐరిస్ స్కానర్ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. భారత్‌లోనూ ఈ ఫీచర్ ఉన్న స్మార్ట్‌ఫోన్లు రంగ ప్రవేశం చేశాయి. అందుబాటు ధరలోనూ ఇవి లభిస్తున్నాయి.

 భద్రంగా సమాచారం..
పాస్‌వర్డ్ మరిచిపోయి తప్పుగా టైప్ చేసినా, ప్యాటర్న్ మరో రకంగా ఇచ్చినా ఫోన్ లాక్ అయిపోతుంది. పాస్‌వర్డ్ తస్కరణకు గురైతే ఇతరులెవరైనా ఉపకరణాన్ని తెరిచేందుకు ఆస్కారం ఉంది. అయితే ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కానర్ వంటి బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్‌తో ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పాస్‌వర్డ్ తస్కరణ సమస్య ఈ విధానంలో ఉండదు. యజమానులు మాత్రమే ఉపకరణాన్ని తెరవగలరు. అందుకే ఈ ఫీచర్లపట్ల మొబైల్ యూజర్లుఇట్టే ఆకర్షితులవుతున్నారు. ఫింగర్ ప్రింట్‌తో పోలిస్తే ఐరిస్ స్కానర్ మరింత భద్రమైంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ-బ్యాంక్, ఆన్‌లైన్ షాపింగ్‌కు కస్టమర్లు ఐరిస్ స్కానర్‌ను వినియోగిస్తున్నారు.

 ఒకదాని వెంట ఒకటి..
మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫీచర్ల హవా నడుస్తోంది. ఫోన్లు అమ్ముడుపోవాలంటే కాస్త వినూత్నత ఉండాల్సిందే. అందుకే చాలా కంపెనీలు ఒకదాని వెంట ఒకటి రిచ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ మోడళ్లు దేశంలో 100 దాకా ఉన్నాయి. రూ.7 వేల నుంచి ఇవి లభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2021 నాటికి ఏటా 100 కోట్ల యూనిట్ల మొబైల్స్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ నిక్షిప్తమై ఉంటుందని మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ ట్రాక్టికా నివేదిక చెబుతోంది. అంటే మొత్తం అమ్ముడయ్యే ఫోన్లలో వీటి వాటా 34 శాతంగా ఉంటుందని వెల్లడించింది.

 ఐరిస్ ఫీచర్‌తో..
ఫోన్‌ను తె రిచేందుకు పాస్‌వర్డ్ టైప్ చేయాలన్నా, ప్యాటర్న్ ఇవ్వాలన్నా కొన్ని సెకన్ల సమయం పడుతుంది. అదే ఐరి స్‌తో సెకను లోపే ఈ తతంగాన్ని పూర్తి చేయవచ్చు. యజమాని తన కన్ను చిత్రాన్ని ఫోన్‌లో ఒకసారి రిజిష్టర్ చేస్తే చాలు. మైక్రోసాఫ్ట్, శాంసంగ్, హెచ్‌పీ, ఆల్కటెల్, జెడ్‌టీఈ, వివో, రిలయన్స్ లైఫ్ స్మార్ట్‌ఫోన్స్, ఫ్యూజిట్సు, యూమీ తదితర కంపెనీలు ఐరిస్ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీపడుతున్నాయి. తాజాగా వీటి జాబితాలోకి టీసీఎల్ సైతం వచ్చి చేరింది. అది కూడా రూ.7,999లకే టీసీఎల్-560 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. భారత్‌లో అతి తక్కువ ధరలో లభిస్తున్న ఐరిస్ స్కానర్ ఫీచర్ కలిగిన స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం.

మరిన్ని వార్తలు