డిజిటల్‌లో అగ్రగామిగా భారత్‌

30 Aug, 2019 06:12 IST|Sakshi
పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ముకేశ్‌ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ

గాంధీనగర్‌: డిజిటల్‌ రంగంలో భారత్‌ త్వరలోనే అగ్రగామిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ‘డిజిటల్‌ రంగం ప్రతీ రోజు, ప్రతీ క్షణం కొత్త పుంతలు తొక్కుతున్న దేశం ఏదైనా ఉందంటే.. అది భారత్‌ మాత్రమేనని ఘంటాపథంగా చెప్పగలను. మొబైల్‌ డేటా విభాగంలో ప్రపంచ దేశాల జాబితాలో 155వ స్థానంలో ఉండే భారత్‌ కేవలం 24 నెలల్లోనే నంబర్‌ వన్‌ స్థాయికి చేరింది. అలాగే నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి విభాగాల్లో కూడా వచ్చే 24 నెలల్లో అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముకేశ్‌ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. భారతదేశం.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీ అని ఆయన పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు