నెట్లో చూశాకే షి‘కారు’

22 Aug, 2018 00:21 IST|Sakshi

న్యూఢిల్లీ: లక్షల రూపాయల ఖరీదు చేసే కారు కొనుక్కోవడమనేది చాలా మందికి ఎమోషనల్‌ వ్యవహారం. ముందుగా రకరకాల కార్లు, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకోవడం నుంచి తమకు అనువైనదాన్ని ఎంపిక చేసుకుని, కొనుక్కునే దాకా అనేక దశలుంటాయి. ఇది కుటుంబ సభ్యులందరికీ కూడా నచ్చాలి. ఇందుకోసం పలు దఫాలుగా వివిధ కార్లు టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తారు.

ఒకటి నచ్చకపోతే మరో కారును ప్రయత్నిస్తారు. ఇవన్నీ ముగిసిన తర్వాతే ఏ కారు కొనుక్కోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలో అనేక దఫాలుగా వివిధ కార్ల షోరూమ్‌లన్నీ సందర్శిస్తుంటారు. అయితే, ఇదంతా క్రమంగా మారుతోంది. కార్ల కోసం షోరూమ్‌లకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మిగతా ఉత్పత్తుల్లాగే కార్ల కొనుగోలు కోసం కూడా ఇంటర్నెట్‌ మాధ్యమంపైనే ఆధారపడే వారి సంఖ్య పెరుగుతోంది.

సౌకర్యంగా ఇంటి దగ్గరే కూర్చుని వివిధ రకాల కార్లు, మోడల్స్, వాటి ప్రత్యేకతల గురించి ఆన్‌లైన్‌లోనే క్షుణ్నంగా తెలుసుకుని నిర్ణయాలు తీసుకునే కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతున్నట్లు దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ కల్సి చెప్పారు. దీంతో ఫీచర్స్‌ గురించి ప్రత్యేకంగా షోరూమ్‌లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోందని ఆయన తెలియజేశారు. గతంలో కస్టమర్లు కార్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకునేందుకు వివిధ కార్ల షోరూమ్‌లను మూడు, నాలుగు సార్లు సందర్శించేవారని, ప్రస్తుతం ఈ విజిట్స్‌ గణనీయంగా తగ్గాయని చెప్పారాయన.

‘‘షోరూమ్‌ను సందర్శించే వారి సంఖ్య తగ్గుతున్న మాట నిజం. కాకపోతే కచ్చితంగా కొనుగోలు చేసేందుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ముందుగానే అన్ని వివరాలూ క్షుణ్ణంగా తెలుసుకుని రావడమే దీనికి కారణం’’ అని ఆయన వివరించారు. షోరూమ్స్‌కి వచ్చేవారి సంఖ్య తగ్గుతున్నా.. మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతుండటం ఇందుకు నిదర్శనం.

గత మూడు, నాలుగేళ్లుగా కొనుగోలుదారుల తీరు క్రమంగా మారుతోందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ విభాగం సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ చీఫ్‌ వీజే రామ్‌ నక్రా చెప్పారు. 2017–2019 ఆర్థిక సంవత్సరాల మధ్యలో తమ వాహనాల గురించి వచ్చే ఎంక్వైరీలు మొత్తం మీద 20% పెరిగాయని.. కానీ షోరూమ్‌కి వచ్చి మరీ తెలుసుకునే వారి సంఖ్య దాదాపు అదే స్థాయిలో తగ్గిందని ఆయన వివరించారు. 2017 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎంక్వైరీ ల్లో వాక్‌–ఇన్స్‌ వాటా 35–40% ఉండగా.. ప్రస్తుతం ఇది 20–25% ఉంటోందని ఆయన తెలియజేశారు.

భిన్నంగా మరికొన్ని సంస్థలు..
అయితే, మరికొన్ని కార్ల కంపెనీల్లో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమ్మకాలతో పాటు షోరూమ్‌లను సందర్శించే కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. దక్షిణ కొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్, దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ వంటివి ఈ జాబితాలో ఉంటున్నాయి. తమ డీలర్‌షిప్స్‌కి వచ్చే వారి సంఖ్య స్వల్ప పెరుగుదలతో అదే స్థాయిలో ఉంటోందని హ్యుందాయ్‌ వర్గాలు తెలిపాయి.

ఇక ఇప్పటిదాకా పోగొట్టుకున్న మార్కెట్‌ వాటాను దక్కించుకునేందుకు కొంగొత్త మోడల్స్‌తో కసరత్తు చేస్తున్న టాటా మోటార్స్‌ షోరూమ్స్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంటోంది. కొత్త తరం కొనుగోలుదారులు కొన్ని ప్రత్యేకమైన అంచనాలతో షోరూమ్‌లకు వస్తున్నారని టాటా మోటార్స్‌ వర్గాలు తెలిపాయి. వేగవంతమైన డెలివరీ, సమస్యల సత్వర పరిష్కారానికి తగిన వ్యవస్థ ఉందా లేదా అన్నది తెలుసునేందుకు, మరింత ఆకర్షణీయమైన డీల్‌ పొందేందుకు వారు ప్రత్యేకంగా షోరూమ్‌లకు వస్తున్నారని వివరించాయి.  


తగ్గుతున్న టెస్ట్‌ డ్రైవ్‌లు..
ముందుగానే ఆన్‌లైన్‌లో వివరాలన్నీ తెలుసుకోవడం వల్ల టెస్ట్‌ డ్రైవ్స్‌కి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గుతున్నట్లు నక్రా తెలిపారు. టెస్ట్‌ డ్రైవ్స్‌ కోసం గతంలో ఒక్కో కస్టమర్‌ సగటున 2.3 సార్లు షోరూమ్‌లకు వచ్చే వారని, ప్రస్తుతం ఇది 1.1కి తగ్గిందని ఆయన వివరించారు. 2017 ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ అమ్మకాల్లో డిజిటల్‌ మాధ్యమం వాటా 10 శాతమే ఉండగా.. ఇప్పుడు 30 శాతం దాకా చేరిందని నక్రా తెలియజేశారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాలు, ప్రథమ శ్రేణి పట్టణాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ–కామర్స్, డిజిటల్‌ మాధ్యమం వినియోగం, ఆన్‌లైన్‌లోనే సెర్చ్‌ చేసి కొనుగోళ్లు జరపడం సిటీల్లోనే సర్వసాధారణంగా ఉంటోందని చెప్పారాయన.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అవాన్‌ మోటార్స్‌ నుంచి ఎలక్ర్టిక్‌ వాహనాలు

టెక్‌ మహీంద్రా బై బ్యాక్‌

అదరగొడుతున్న శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్లు

ప్రభుత్వ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్‌ బూస్ట్‌

ఫ్లిప్‌కార్ట్‌ హబ్‌ నుంచి 150 మొబైల్స్‌ చోరీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’

నానితో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌!

శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి

ప్రముఖ నిర్మాత కన్నుమూత

సాహో సెట్‌లో స్టార్ హీరో

అలాంటి పాత్రలివ్వండి ప్లీజ్‌!