దైచీ ఆర్బిట్రేషన్‌లో కొత్త మలుపు!

27 Feb, 2018 01:29 IST|Sakshi

ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్, ఆస్కార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆస్తుల జప్తుకు ఆదేశాలు

న్యూఢిల్లీ: జపాన్‌ ఫార్మా దిగ్గజం–  దైచీ శాంక్యో గెలిచిన రూ.3,500 కోట్ల ఆర్బ్రిట్రేషన్‌ కేసు అమలు దిశలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ర్యాన్‌బాక్సీ లేబొరేటరీస్‌ ఒకప్పటి ప్రమోటర్లు– మల్వీందర్‌ సింగ్, శివేందర్‌ సింగ్‌లకు చెందిన రెండు హోల్డింగ్‌ కంపెనీలు– ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్, ఆస్కార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన ఆస్తుల్ని జప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జయంత్‌ నాథ్‌ వారెంట్లు జారీ చేశారు.

తనఖాలో లేని ఆస్తుల జాబితాను 10 రోజుల్లో అందజేయాలని– సోదరులు మల్విందర్‌ సింగ్, శివేందర్‌ సింగ్‌లతో పాటు మరో 10 మందికి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కేసు తదపరి విచారణను మార్చి 23వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకూ వేతనాలు, చెల్లించాల్సిన బకాయిలకు మినహా మిగిలిన కార్యకలాపాలు దేనికీ  ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌ తన బ్యాంక్‌ ఖాతాలోని సొమ్మును వినియోగించరాదని సైతం ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. సింగ్‌ సోదరులు, ఈ కేసుకు సంబంధం ఉన్నవారు తమ స్థిర, చర ఆస్తులను అమ్మడం కానీ, బదలాయించడం కానీ చేయరాదని ఇంతక్రితమే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

మరిన్ని వార్తలు