కొత్త ఏడాదిలోనూ ఎఫ్‌పీఐల జోరు

29 Jan, 2018 02:18 IST|Sakshi

ఇప్పటికే రూ.19,000 కోట్ల పెట్టుబడులు

కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌పై అంచనాలతోనే

న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన దేశ క్యాపిటల్‌ మార్కెట్ల పట్ల తమ మక్కువను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే మూడు బిలియన్‌ డాలర్ల మేర (సుమారు రూ.19,200 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. కార్పొరేట్‌ కంపెనీల ఎర్నింగ్స్‌ మెరుగుపడతాయన్న అంచనాలు, ఆకర్షణీయ రాబడులే వారిని పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్ల (డెట్, ఈక్విటీ) నుంచి నికరంగా రూ.3,500 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

ఆ తర్వాత ఈ నెలలో ఇప్పటి వరకు నికర కొనుగోలుదారులుగా ఉండటం గమనార్హం. ‘‘ప్రస్తుత నెలలో విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి.. ఎర్నింగ్స్‌ రికవరీపై ఉన్న అంచనాలు, ఆకర్షణీయ రాబడులే కారణం. ఈ అంశాలే విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల రాకను మరింత బలోపేతం చేస్తాయి’’అని 5నాన్స్‌ సీఈవో దినేష్‌ రోహిరా తెలిపారు. డిపాజిటరీల డేటా ప్రకారం ఈ నెల 1 నుంచి 25 వరకు... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నికరంగా ఈక్విటీల్లో రూ.11,759 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేయగా, డెట్‌లో రూ.6,127 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.

దీంతో నికరంగా 17,866 కోట్ల మేర వారు దేశీయ క్యాపిటల్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసినట్లయింది. 2017లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మన దేశ ఈక్విటీ, డెట్‌ మార్కెట్లో నికరంగా రూ.2 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేయడం తెలిసిందే. అయితే, ఇదే పరిస్థితి 2018లోనూ పునరావృతం కాకపోవచ్చని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్‌ పంకజ్‌ పాఠక్‌ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రేట్లు పెరగడం, ఉపసంహరణలే దీనికి కారణాలుగా పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు