పసిడి... 1240 వద్ద మద్దతు

26 Jun, 2017 00:12 IST|Sakshi
పసిడి... 1240 వద్ద మద్దతు

వారంలో స్వల్ప పెరుగుదల
అదే స్థాయిలో బలహీనపడిన డాలర్‌ ఇండెక్స్‌  


న్యూయార్క్‌/ముంబై: అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్ఛంజ్‌లో పసిడి శుక్రవారం 23వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా 2 డాలర్లు పెరిగింది. ఔన్స్‌ (31.1గ్రా) ధర  కేవలం రెండు డాలర్లు పెరిగి 1,258 డాలర్లకు చేరింది. పది రోజుల క్రితం అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు (ప్రస్తుతం 1–1.25 శాతం) పావు శాతం పెరగటమే దీనిక్కారణంగా కనిపిస్తోంది. రేటు పెరుగుతుందన్న అంచనాలతో జూన్‌ 9తో ముగిసిన వారంలోనే... ఐదువారాల పరుగును ఆపి బంగారం 10 డాలర్లు తగ్గింది.

ఈ అంచనాలను నిజం చేస్తూ... 14వ తేదీన ఫెడ్‌ తీసుకున్న రేటు పెంపు నిర్ణయంతో 16వ తేదీతో ముగిసిన వారంలో మరో 13 డాలర్లు తగ్గింది. అంటే పక్షం రోజుల్లో పసిడి దాదాపు 23 డాలర్లు తగ్గింది. డాలర్‌  బలహీనపడుతుందన్న అంచనాలు ఇందుకు కారణంకాగా, రేటు పెంపు డాలర్‌ ఇండెక్స్‌కు సానుకూలమన్న తక్షణ అంచనాలు పసిడిలో ఇన్వెస్లర్ల లాభాల స్వీకరణకు కారణమైంది. ఇక డాలర్‌ ఇండెక్స్‌ మాత్రం వారం వారీగా స్వల్పంగా తగ్గి 97.16 నుంచి 96.98కి చేరింది.

 అమెరికా ఆర్థిక, రాజకీయ పరిణామాలు,  అమెరికా అధ్యక్షుడి డాలర్‌ ‘బలహీన’ లక్ష్యం విధానాలు పసిడి పెరుగుదలకు భవిష్యత్తులో  దోహదపడతాయన్న అంచనాలూ ఉన్నాయి. పసిడికి 1,240 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. గడచిన వారంలో రెండుసార్లు ఇదే స్థాయికి పడిన పసిడి, అక్కడి నుంచి పైకి ఎగయడం గమనార్హం. పసిడి తగ్గుదల కొనుగోళ్లకు అవకాశమన్నది పలువురి విశ్లేషణ. 103.88 గరిష్ట స్థాయిని చూసిన డాలర్‌ ఇండెక్స్‌ ప్రస్తుతం 97 స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే.

భారత్‌లోనూ కొంచెం ముందుకు...
మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌)లో బంగారం ధర 10 గ్రాములకు జూన్‌ 23వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా రూ. 44 పెరిగి రూ. 28,734కు చేరింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్‌ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ. 120 పెరిగి రూ. 28,940కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో లాభపడి రూ. 28,790కి చేరింది. కాగా వెండి కేజీ ధర వారం వారీగా అక్కడక్కడే రూ. 38,960 వద్ద నిలకడగా ఉంది.

మరిన్ని వార్తలు