ఇంటి రుణం తీర్చే.. ఈజీ మార్గాలివి!

5 Feb, 2018 01:37 IST|Sakshi

ఏటా వేతనం పెరిగితే దానికి తగ్గట్టే రుణ చెల్లింపు

బోనస్, ఇతరత్రా నగదు అందితే అదీ ఈఎంఐకే

ఇలా చేస్తే వడ్డీ భారం; కాల వ్యవధి రెండూ తగ్గుతాయి

లేదంటే రుణ కాల వ్యవధి పెంచుకోవడమే పరిష్కారం  

సొంతింటిని గౌరవానికి చిహ్నంగా భావించే వారు మనలో చాలామంది. సొంతిల్లును తమ జీవితంలో కీలక లక్ష్యాల్లో ఒకటిగా చేర్చుకోవడంతో పాటు దాన్ని ఏదో ఒకరోజు వీలైతే చిన్న వయసులోనే సాకారం చేసుకోవాలని కోరుకోవడం సహజం. తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు లభించే ప్రస్తుత పరిస్థితుల్లో సొంతింటి కల సాకారం అసాధ్యమేమీ కాదు. కేంద్రం నుంచి ఇళ్ల కొనుగోలుకు వడ్డీ రాయితీలు కూడా ఉండడంతో బడ్జెట్‌ ధరలోని గృహాలకు డిమాండ్‌ పెరిగింది.

మున్ముందు ఈ మార్కెట్‌ ఇంకా వృద్ధి చెందుతుందనేది నిపుణుల అంచనా. అయితే, సొంతింటికి ప్లాన్‌ చేసుకునే వారు తమ వంతు కొంత నిధిని సమకూర్చుకోకపోతే ప్రతి నెలా అధికంగా ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. దీంతో వస్తున్న ఆదాయంలో అధిక భాగం ఇంటి రుణ వాయిదాలకే చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఇంటి రుణాన్ని ఇబ్బంది లేకుండా స్మార్ట్‌గా తీర్చే మార్గాలను నిపుణులు తెలియజేస్తున్నారు...


బోనస్‌ వస్తే కొంత తీర్చేయాలి..
కార్పొరేట్‌ ఉద్యోగుల్లో చాలా మందికి వార్షికంగా బోనస్‌ అందడం సహజం. ఈ బోనస్‌ను కూడా రుణ చెల్లింపులకు కేటాయించుకోవాలి. దీన్ని అదనపు ఈఎంఐగా భావించాలి. ఇలా ముందే రుణాన్ని తీర్చివేయడం ఆరంభిస్తే తిరిగి చెల్లించాల్సిన కాల వ్యవధి తగ్గుతుంది. ముందుగానే అదనంగా చెల్లింపులు చేయడం వల్ల కొన్నాళ్లకు ఈఎంఐ భారం కూడా దిగొస్తుంది.

దీర్ఘకాలంలో ఇదో మంచి నిర్ణయం అవుతుంది. ఫ్లోటింగ్‌ వడ్డీ రుణాలపై ముందస్తు చెల్లింపుల చార్జీలను చాలా వరకు బ్యాంకులు, హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు వసూలు చేయడం లేదు. ఇక ముందుగానే రుణాన్ని తీర్చివేయడం వల్ల క్రెడిట్‌ స్కోరు కూడా పెరుగుతుంది.

రుణం దీర్ఘకాలానికి తీసుకుంటేనే బెటర్‌
ఈఎంఐ భారం తగ్గించుకోవటానికి ఉన్న మార్గాల్లో రుణాన్ని దీర్ఘకాలానికి తీసుకోవడం ఒకటి. ప్రతి నెలా వస్తున్న ఆదాయంలో ఇంటి రుణానికే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంటే దీనికి బదులు రుణ కాల వ్యవధి పెంపును పరిశీలించొచ్చు. ఉదాహరణకు రూ.60 లక్షల ఇంటి రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారనుకోండి.

వడ్డీ రేటు 9 శాతం అనుకుంటే నెలసరి ఈఎంఐ రూ.53,984 అవుతుంది. ఈ కాల వ్యవధిని 20 ఏళ్లకు బదులు 30 ఏళ్లకు పెంచుకున్నారనుకోండి. అప్పుడు ఈఎంఐ రూ.48,227కు తగ్గుతుంది. ప్రతి నెలా రూ.5,757 వెసులుబాటు లభిస్తుంది. ఒకవేళ ఇలా వ్యవధి పెం చుకున్నప్పటికీ వేతనం పెరిగిన సందర్భాల్లో ఈఎంఐ పెంచుకుంటూ వెళితే నిర్ణీత కాలం కంటే ముందే రుణ చెల్లింపులు ముగుస్తాయి.

మధ్య మధ్యలో అదనంగా...
జీవితంలో అప్పుడప్పుడు కొంత మేర అదనపు ఆదాయం లభించిన సందర్భాలను సైతం రుణం చెల్లింపులకు వాడుకోవాలి. జీవిత బీమా మనీ బ్యాక్‌ పాలసీ నుంచి వచ్చే ఆదాయం, లేదా మెచ్యూరిటీ తీరిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కానీయండి... వీటిని గృహ రుణ చెల్లింపులకు వినియోగించాలి. ఈ విధంగా చేతికి అందే అదనపు నిధులను ఇంటి రుణం భారం దింపుకునేందుకు వాడడం మంచి ఆలోచనే.

ఉదాహరణకు రూ.50 లక్షల రుణంపై (15 ఏళ్ల కాల వ్యవధితో 9 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటే) మొదటి మూడు సంవత్సరాల్లో రూ.లక్ష చెల్లించగలిగితే లోన్‌ టర్మ్‌లో రూ.1.88 లక్షల మొత్తం.. ఆరు నెలల కాల వ్యవధి తగ్గుతాయి. ఈ విధంగా రుణ కాల వ్యవధిలో రెండు మూడు సార్లు అదనపు చెల్లింపులు చేసినాగానీ భారం చాలా వరకు తగ్గుతుంది.

రుణ బదిలీ చేసుకోవచ్చు...
ఇప్పటికే రుణం తీసుకుని ఉన్నారు. ఈఎంఐ భారంగా అనిపిస్తుంటే, దీనికంటే తక్కువ వడ్డీకి, సులభ నిబంధనలపై మరో సంస్థ రుణం అందిస్తుంటే రుణాన్ని బదలాయించుకోవడం మంచి ఆప్షనే అవుతుంది. దీన్నే బ్యాలన్స్‌ ట్రాన్స్‌ఫర్‌గా పేర్కొంటారు. అయితే, రుణాన్ని బదలాయించుకునేందుకు అయ్యే వ్యయాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.

ఫీజులు, మార్ట్‌గేజ్‌పై స్టాంప్‌డ్యూటీ చార్జీలను లెక్క వేసుకుని బదలాయింపు లాభదాయకం అనుకుంటేనే ఆ పనిచేయాలి. ప్రస్తుతం వడ్డీ రేట్లు చాలా వరకు దిగొచ్చాయి. 8.35 శాతానికే రుణాలు లభిస్తున్నాయి. మరీ ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలైతే బదిలీ అవకాశాన్ని పరిశీలించొచ్చు. కాకపోతే మనం తీసుకున్న రుణం ఏ తరహాది,  కాల వ్యవధి, తీసుకున్న రుణం మొత్తం వంటి అంశాలపై ఈ బదిలీ ఆధారపడి ఉంటుంది. 

మరిన్ని వార్తలు