పీఎన్‌బీ స్కామ్‌... వ్యవస్థాపరమైన వైఫల్యం కాదు

17 Mar, 2018 02:21 IST|Sakshi

ప్రపంచబ్యాంకు అభిప్రాయం

ప్రభుత్వం విధానాలకే పరిమితం కావాలి

మిగిలింది నియంత్రణ సంస్థలకు వదిలేయాలని సూచన

ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో చోటు చేసుకున్న రూ.13,000 కోట్ల స్కామ్‌ను ప్రపంచ బ్యాంకు చిన్న అంశంగా తీసేసింది. ఇది వ్యవస్థాపరమైన సమస్య కాదంటూనే ఈ తరహా స్కామ్‌లు తిరిగి జరగకుండా పాలనా పరంగా మరిన్ని మార్పులు అవసరమని అభిప్రాయపడింది. ‘‘ఓ కుంభకోణం అన్నది నియంత్రణపరమైన పర్యవేక్షణ విధానం లేదా బ్యాంకింగ్‌ రంగం పూర్తి సామర్థ్యంతో ఉన్నదా లేదా అన్నది పరిశీలించేందుకు ముఖ్యమైనది. ఒక స్కామ్‌ వ్యవస్థ వైఫల్యానికి సంకేతంగా నేను చూడటం లేదు’’ అని ప్రపంచ బ్యాంకు భారత డైరెక్టర్‌ జునైద్‌ కమల్‌ అహ్మద్‌ అన్నారు.

పట్టణ నీటి సరఫరాను ఉదహరిస్తూ దేశంలో సేవల పంపిణీ నమూనాపై పునరాలోచన అవసరమని సూచించారు. భారత్‌లో ప్రభుత్వమే విధానకర్తగాను, నియంత్రించే వ్యవస్థగా, సేవల పంపిణీ ఏజెంట్‌గా ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వం కేవలం విధానాల రూపకల్పనకే పరిమితమై, మిగిలినది నియంత్రణ సంస్థలకు, థర్డ్‌ పార్టీ సర్వీసు ఏజెంట్లకు విడిచిపెట్టాలని సూచించారు.

అధికారాల్లో విభజన చేయడం ద్వారానే సేవల్లో పారదర్శకత తీసుకురాగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, మరింత పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఇప్పటికే కొన్ని మార్పులు చేపట్టడం జరిగిందన్నారు. అందరికీ ఆర్థిక సేవలు, ప్రత్యక్ష నగదు బదిలీ, ఆధార్‌ అన్నవి దీర్ఘకాలంలో పారదర్శకత తీసుకురాగలవన్నారు.

తరచుగా బాస్‌లను మార్చడం వల్లే: అరుంధతి
ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులను తరచుగా మార్చడంపై ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల నాయకత్వంలో నెలల తరబడి శూన్యత ఏర్పడటంతోపాటు, కొత్తగా వచ్చే వారికి నియంత్రణ లోపించి బ్యాంకుల సాఫీ నిర్వహణపై ప్రభావం పడుతుందన్నారు.

పీఎన్‌బీలో రూ.13,000 కోట్ల నీరవ్‌మోదీ స్కామ్‌ నేపథ్యంలో ముంబై యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల నాయకత్వంలో కొన్ని మార్పులు చేశారని, దీంతో వాటికి చాలా నెలలుగా అధిపతులు లేని పరిస్థితి నెలకొందన్నారు. నేరుగా పీఎన్‌బీ స్కామ్‌ గురించి ఆమె ప్రస్తావించకుండా, ఇటీవల బయపడిన స్కామ్‌ దురదృష్టకరమని, కోర్‌ బ్యాంకింగ్‌ సాఫ్ట్‌వేర్, స్విఫ్ట్‌ ప్లాట్‌ఫామ్‌ మధ్య అనుసంధానత లేకపోవడమే కారణమన్నారు.

మరిన్ని వార్తలు