ఒడిదుడుకుల వారం

19 Feb, 2018 00:10 IST|Sakshi

పీఎన్‌బీ స్కామ్‌ ప్రభావం కొనసాగుతుంది..

ఈ వారమే ఎఫ్‌ అండ్‌ఓ ఎక్స్‌పైరీ  

ముడి చమురు ధరల గమనం కీలకమే

ఈ వారం మార్కెట్‌పై విశ్లేషలకు అభిప్రాయం

ప్రపంచ మార్కెట్ల పోకడ, ముడి చమురు ధరల గమనం వంటి అంతర్జాతీయ అంశాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు కీలకమని నిపుణులంటున్నారు. వీటితో పాటు దేశీయంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం ప్రకంపనలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు.

ఈ నెల ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ ) కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగుస్తున్నందున స్టాక్‌ సూచీలు ఒడిదుడుకులకు గురవుతాయని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. మరోవైపు విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం తదితర అంశాలు కూడా స్టాక్‌ సూచీల కదలికలను నిర్దేశిస్తాయని వారు పేర్కొన్నారు.  

ఆల్‌టైమ్‌ హై నుంచి 6 శాతం డౌన్‌..
స్టాక్‌ సూచీలు వాటి జీవిత కాల గరిష్ట స్థాయిల నుంచి చూస్తే 6 శాతం వరకూ పతనమయ్యాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఈ భారీ స్థాయి పతనం కారణంగా స్వల్ప కాలంలో స్టాక్‌సూచీలు స్థిరీకరణ అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

అయితే వాణిజ్య లోటు మరింతగా పెరగడం, బాండ్‌ ఈల్డ్స్‌ అంతకంతకూ పెరుగుతుండడం, అంతర్జాతీయంగా ఒడిదుడుకులు చోటు చేసుకోవడం తదితర కారణాల వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటిస్తున్నారని వివరించారు. పీఎన్‌బీ స్కామ్‌ ఇతర బ్యాంక్‌లకు కూడా విస్తరించే అవకాశాలున్నాయని, సమీప కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లపై ఒత్తిడి కొనసాగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.
 
పీఎన్‌బీ స్కామ్‌ కారణంగా ఆందోళన చెందిన ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌(ప్రైవేట్‌ క్లయింట్‌ గ్రూప్‌) వి.కె. శర్మ చెప్పారు. పీఎన్‌బీ స్కామ్‌ ప్రభావంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు మరింతగా పతనమయ్యే అవకాశాలున్నాయి. వాణిజ్య లోటు మరింతగా పెరగడం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. 

ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, జపాన్, అమెరికా, యూరప్‌ తయారీ రంగాల పర్చేజింగ్‌ మేనేజర్స్‌  ఇండెక్స్‌(పీఎమ్‌ఐ) గణాంకాలు  ఈ బుధవారం(ఈ నెల 21న) వస్తాయి. ఈ నెల 17తో ముగిసిన వారానికి సంబంధించిన అమెరికా జాబ్‌లెస్‌ క్లెయిమ్స్‌ గణాంకాలు ఈ నెల 22న (గురువారం) వెల్లడవుతాయి. ఇక శుక్రవారం(ఈ నెల 23న) యూరప్, జపాన్‌ల జనవరి నెల రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు, జర్మనీ క్యూ4 జీడీపీ గణాంకాలు వస్తాయి.  


వంద కోట్ల డాలర్ల విదేశీ నిధులు వెనక్కి 
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)మన స్టాక్‌ మార్కట్‌ నుంచి ఈ నెలలో వంద కోట్ల డాలర్లు(రూ6,850 కోట్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లలలో అమ్మకాలు వెల్లువెత్తడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొన్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం.., ఈ నెల 1–16 మధ్యన విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.6,844 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా, డెట్‌ మార్కెట్లో మాత్రం రూ.3,215 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. 

గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్‌ మార్కెట్లో రూ.13,780 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. భారత దేశపు పది సంవత్సరాల బాండ్ల రాబడి 7.5 శాతాన్ని మించిందని, గత ఏడాది జూలై తర్వాత ఇదే అధికమని, అందుకనే మన డెట్‌మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరిగాయని ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫార్మ్‌ గ్రో సీఓఓ హర్‌‡్ష జైన్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు