ఉద్దీపన ప్యాకేజీతో ఆదుకోండి

2 May, 2020 04:24 IST|Sakshi

వార్తాపత్రికల పరిశ్రమకు రూ. 15,000 కోట్ల నష్టాల ముప్పు

కేంద్రానికి ఐఎన్‌ఎస్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఆదాయం పడిపోయి వార్తాపత్రికల సంస్థలు కుదేలవుతున్నాయని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రకటనల ఆదాయం, సర్క్యులేషన్‌ తగ్గిపోవడంతో న్యూస్‌పేపర్‌ పరిశ్రమ ఇప్పటికే రూ. 4,000–4,500 కోట్ల దాకా నష్టపోయిందని పేర్కొంది. ప్రభుత్వం తక్షణం ఉద్దీపన ప్యాకేజీలాంటిదేదైనా ఇవ్వకపోతే వచ్చే ఆరు.. ఏడు నెలల్లో దాదాపు రూ. 15,000 కోట్ల దాకా నష్టపోయే ముప్పు ఉందని తెలిపింది.

కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఐఎన్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ గుప్తా ఈ అంశాలు పేర్కొన్నారు. వార్తాపత్రిక పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 లక్షల మంది పైచిలుకు జర్నలిస్టులు, ప్రింటర్లు, డెలివరీ వెండార్లు వంటి వారు పనిచేస్తున్నారని, నష్టాల కారణంగా వీరందరిమీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో న్యూస్‌ప్రింట్‌పై అయిదు శాతం కస్టమ్స్‌ సుంకాన్ని ఎత్తివేయాలని, రెండేళ్ల పాటు న్యూస్‌పేపర్‌ సంస్థలకు ట్యాక్స్‌ హాలిడే ఇవ్వాలని, ప్రింట్‌ మీడియా బడ్జెట్‌ను 100 శాతం పెంచాలని ఐఎన్‌ఎస్‌ విజ్ఞప్తి చేసింది. పెండింగ్‌ అడ్వర్టైజింగ్‌ బిల్లులను తక్షణం సెటిల్‌ చేయాలని కోరింది.  

తక్షణమే ప్యాకేజీ ప్రకటించాలి: కార్పొరేట్‌ ఇండియా
కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు పరిశ్రమలకు వెంటనే ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించాలని దేశీయ పరిశ్రమలు (కార్పొరేట్‌ ఇండియా) కేంద్రాన్ని డిమాండ్‌ చేశాయి. లాక్‌డౌన్‌ తీవ్రమైన ఆర్థిక విఘాతానికి దారితీసినట్టు కార్పొరేట్‌ ఇండియా వ్యాఖ్యానించింది. లాక్‌డౌన్‌ను మే 4 నుంచి మరో రెండు వారాల పాటు కొనసాగిస్తూ, అదే సమయంలో ఆరెంజ్, గ్రీన్‌ జోన్లలో ఎన్నో వెసులుబాట్లు ఇవ్వడాన్ని స్వాగతించింది. నియంత్రణలతో కూడిన ఆర్థిక కార్యకపాల నేపథ్యంలో సత్వరమే, ప్రభావవంతమైన సహాయక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉందని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ అన్నారు.

>
మరిన్ని వార్తలు