ఇక మార్కెట్లపై ఎఫ్‌అండ్‌వో ఎఫెక్ట్‌

20 Jun, 2020 11:22 IST|Sakshi

గురువారం డెరివేటివ్స్‌ ముగింపు

3 వారాల గరిష్టం వద్ద మార్కెట్లు

10,500 పాయింట్లవైపు నిఫ్టీ చూపు

10,100 వద్ద నిఫ్టీకి కీలక సపోర్ట్‌

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లపై ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌అండ్‌వో) విభాగం ప్రభావం చూపనుంది. గురువారం(25న) జూన్‌ నెల డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. దీంతో ట్రేడర్లు తమ పొజిషన్లను జులై సిరీస్‌కు రోలోవర్‌ చేసుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు కంపెనీల క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు, చైనాతో సరిహద్దు వివాదాలు, కరోనా కేసుల సంఖ్య వంటి అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మార్కెట్‌ విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు పటిష్ట లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్‌ నికరంగా 951 పాయింట్లు(2.8 శాతం) జంప్‌చేసి 34,732 వద్ద నిలవగా.. నిఫ్టీ 272 పాయింట్లు(2.7 శాతం) ఎగసి 10,244 వద్ద స్థిరపడింది. వెరసి గత మూడు వారాలలో నమోదైన గరిష్టం వద్ద మార్కెట్లు నిలిచినట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.

కదలికలు ఇలా..
వారాంతాన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 100 రోజుల చలన సగటుకు ఎగువన 10,200 వద్ద ముగిసినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. గురువారం 10,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించడంతో జోరందుకున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా సమీప కాలంలోనే ఇటీవల గరిష్టం 10,338ను నిఫ్టీ తాకే వీలున్నట్లు షేర్‌ఖాన్‌ టెక్నికల్‌ విశ్లేషకులు గౌవర్‌ రత్నపార్ఖి అంచనా వేశారు. ఈ బాటలో జనవరి-మార్చి పతనానికి 61.8 శాతం రీట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 10,550వైపు సాగవచ్చని భావిస్తున్నారు. వచ్చే వారం నిఫ్టీకి 10,155-10,135 శ్రేణిలో తొలి సపోర్ట్‌ లభించవచ్చని పేర్కొన్నారు. చార్ట్‌వ్యూఇండియా నిపుణులు మజర్‌ మొహమ్మద్‌ సైతం 10,328ను నిఫ్టీ అధిగమించవచ్చని ఊహిస్తున్నారు. నిఫ్టీకి గత వారం చివర్లో జోష్‌వచ్చిందని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌ మోడీ పేర్కొన్నారు. అయితే గత రెండు వారాల్లో 10,100-10,150 స్థాయిలో నిఫ్టీకి కీలక అవరోధాలు ఎదురైనట్లు తెలియజేశారు.​ దిగువ స్థాయిలో 9,550 వద్ద నిఫ్టీకి కీలక మద్దతు లభించే వీలున్నట్లు అంచనా వేశారు.

జాబితా ఇదీ
వచ్చే వారం పలు కంపెనీలు గతేడాది(2019-20) క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ప్రధాన కంపెనీలలో నేడు పవర్‌గ్రిడ్‌ పనితీరు వెల్లడించనుండగా.. ఏషియన్‌ పెయింట్స్‌(23న), గెయిల్‌ ఇండియా(24న), కోల్‌ ఇండియా, ఐటీసీ(26న) ఫలితాలు విడుదల చేయనున్నాయి. ప్రపంచ మార్కెట్ల తీరు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు సైతం మార్కెట్ల గమనాన్ని నిర్దేశించగలవని విశ్లేషకులు వివరించారు.

మరిన్ని వార్తలు