రామగుండం ఎరువుల ప్లాంటుకు జేవీ ఏర్పాటు

20 Feb, 2015 01:31 IST|Sakshi
రామగుండం ఎరువుల ప్లాంటుకు జేవీ ఏర్పాటు

న్యూఢిల్లీ: రామగుండం ఎరువుల ప్లాంటు పునరుద్ధరణ కోసం ప్రభుత్వ రంగ ఎన్‌ఎఫ్‌ఎల్, ఈఐఎల్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ కలసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఈ నెల 17న జేవీని ఏర్పాటు చేసినట్లు బీఎస్‌ఈకి నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్‌ఎఫ్‌ఎల్) తెలియజేసింది. కొత్తగా ఏర్పడిన సంస్థలో ఎన్‌ఎఫ్‌ఎల్, ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్) కంపెనీలకు చెరి 26 శాతం, ఫెర్టిలైజర్ కార్పొరేషన్‌కి 11 శాతం వాటాలు ఉంటాయి. జేవీలో భాగం అయ్యేందుకు ముందుకొచ్చే ఇతర సంస్థలకు మిగతా వాటాలు దక్కనున్నాయి.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న రామగుండం ఎరువుల యూనిట్‌లో 1999 నుంచి యూరియా, అమ్మోనియా ఉత్పత్తిని నిలిపివేశారు. లాభదాయకత లేకపోవడమే ఇందుకు కారణం. తాజాగా మూతబడిన ఎరువుల ప్లాంట్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా రామగుండం ప్లాంటుకు కూడా మోక్షం లభించింది. దాదాపు రూ. 5,000 కోట్ల వ్యయంతో దీన్ని పునరుద్ధరించనున్నారు.

మరిన్ని వార్తలు