10,000 ముంగిట నిఫ్టీ

26 Jul, 2017 00:53 IST|Sakshi
10,000 ముంగిట నిఫ్టీ

కొద్ది క్షణాల్లో మళ్లీ కిందకు
సెన్సెక్స్‌ మరో కొత్త హై
స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు


1000
  1996 సంవత్సరం

2000
  డిసెంబర్‌ 2, 2004

3000
  జనవరి 30, 2006

4000
  డిసెంబర్‌ 1,  2006

5000
  సెప్టెంబర్‌ 27, 2007

6000
  డిసెంబర్‌ 11, 2007

7000
   మే 12, 2014

8000
  సెప్టెంబర్‌ 1, 2014

9000
  మార్చి 14, 2017



ముంబై: కొద్ది వారాల నుంచి ఇన్వెస్టర్లను ఊరిస్తూవచ్చిన చరిత్రాత్మక 10,000 పాయింట్ల స్థాయిని ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ–50 సూచీ ఎట్టకేలకు మంగళవారం అందుకుంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో 10,010 పాయింట్ల రికార్డును సృష్టించిన నిఫ్టీ కొద్ది క్షణాల్లోనే, ఆ స్థాయి నుంచి దిగువకు జారిపోయింది. ఇన్వెస్టర్లు గతంలో ఎన్నడూచూడని స్థాయికి సూచీ చేరగానే లాభాల స్వీకరణ జరగడంతో 9,949 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 1.85 పాయింట్ల స్వల్పనష్టంతో 9,964.55 పాయింట్ల వద్ద ముగిసింది.

 మరోవైపు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కూడా ట్రేడింగ్‌ ప్రారంభంలో 32,374 పాయింట్ల కొత్త గరిష్టస్థాయిని చేరింది. ఈ సూచీ చివరకు 18 పాయింట్ల నష్టంతో 32,228 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కొన్ని బ్లూచిప్‌ కంపెనీలు మార్కెట్‌ అంచనాలకంటే మెరుగైన ఫలితాల్ని వెల్లడించిన నేపథ్యంలో దేశీ, విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్‌లోకి నిధులు కుమ్మరించడంతో నిఫ్టీ చరిత్ర సృష్టించగలిగిందని విశ్లేషకులు తెలిపారు. బుధవారం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్నందున, మార్కెట్లో చిన్నపాటి కరెక్షన్‌ జరిగినట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.

 బ్యాంక్‌ నిఫ్టీ రికార్డు...
ప్రధాన సూచీల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, కొద్దిరోజుల నుంచి ఏరోజుకారోజు కొత్త రికార్డులు నెలకొల్పుతున్న బ్యాంక్‌ నిఫ్టీ మంగళవారం మరో నూతన గరిష్టస్థాయి 24,625 పాయింట్ల స్థాయికి చేరింది. ట్రేడింగ్‌ ముగింపులో కూడా ఈ సూచీ 100 పాయింట్ల లాభంతో (0.41 శాతం) 24,520 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచీలో భాగమైన యాక్సిస్‌ బ్యాంక్‌ 1.94 శాతం పెరిగి రూ. 545 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో చరిత్రాత్మక గరిష్టస్థాయి రూ. 1,759 వరకూ ర్యాలీ జరిపిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చివరకు స్వల్పలాభంతో రూ. 1,739 వద్ద ముగిసింది. యస్‌ బ్యాంక్, ఎస్‌బీఐలు కూడా స్వల్ప పెరుగుదలతో బ్యాంక్‌ నిఫ్టీ లాభాలతో ముగియడానికి కారణమయ్యాయి.

 టెలికం షేర్లు జూమ్‌...
స్పెక్ట్రం ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం..టెలికం కంపెనీలకు మరింత సమయం ఇవ్వనున్నదన్న వార్తలతో టెలికం షేర్లు జోరుగా పెరిగాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 1.76 శాతం పెరిగి 52 వారాల గరిష్టస్థాయి రూ. 428 వద్ద ముగిసింది. ఐడియా సెల్యులార్‌ షేరు 6 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 97.70 వద్ద క్లోజయ్యింది. అలాగే వరుసగా రెండోరోజు ర్యాలీచేసిన టీసీఎస్‌ మరో 1.5 శాతం పెరుగుదలతో రూ. 2,570 వద్ద క్లోజయ్యింది. మెటల్స్‌ దిగ్గజం వేదాంత ఆకర్షణీయమైన ఫలితాల్ని ప్రకటించడంతో 4 శాతంపైగా పెరగ్గా, అల్యూమినియం తయారీ కంపెనీ హిందాల్కో 2 శాతంపైగా ఎగిసింది.

21 సంవత్సరాల్లో 900 శాతం
1992లో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) ప్రస్థానం మొదలయ్యింది. 1993లో స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొంది 1994లో క్యాష్‌ సెగ్మెంట్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టి ట్రేడింగ్‌ను సులభతరం చేసింది. అదే ఏడాదిలోనే డెట్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది. 1996లో నిఫ్టీ 50 సూచీని ప్రారంభించింది. 1,000 పాయింట్లను బేస్‌గా తీసుకుని 12 రంగాలకు చెందిన షేర్లతో సూచీని ప్రారంభించింది. నిఫ్టీ సూచీ ట్రేడ్‌కావడం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 9 రెట్లు పెరిగింది. నిఫ్టీ ప్రస్థానం మొదలైన నాటినుంచి ఇప్పటివరకూ... 21 సంవత్సరాల్లో 900 శాతం ర్యాలీ జరిపింది. ఈ 21 ఏళ్లలో చక్రగతిన 11.6 శాతం వృద్ధిని నమోదుచేసింది. కాగా, ఈ ఏడాదిలోనే వరుసగా 9,000, 10,000 పాయింట్ల శిఖరాల్ని ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అధిరోహించడం విశేషం.

మరిన్ని వార్తలు