మళ్లీ 10,500 పాయింట్ల పైకి నిఫ్టీ

25 May, 2018 01:19 IST|Sakshi

షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్ల జోరు  

రూపాయి పతనంతో  ఐటీ షేర్ల ర్యాలీ 

సెన్సెక్స్‌ 318 పాయింట్ల లాభం  

84 పాయింట్లు పెరిగి 10,514కు నిఫ్టీ 

ఇటీవల బాగా నష్టపోయిన షేర్లలో కొనుగోళ్లు జరగడంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిసింది. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు కొనసాగుతుండటంతో సెన్సెక్స్‌ 34,500 పాయింట్ల, నిఫ్టీ 10,500 పాయింట్ల ఎగువన ముగిశాయి. బలహీనమైన రూపాయి కారణంగా ఐటీ షేర్లు దూసుకుపోవడంతో అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, స్టాక్‌ సూచీలు మంచి లాభాలు సాధించాయి. వచ్చే వారం మే సిరిస్‌ డెరివేటవ్‌ కాంట్రాక్టులు ముగింపు సందర్భంగా షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకోవడం కూడా సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 318 పాయింట్ల లాభంతో 34,663 పాయింట్ల వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 10,514 పాయింట్ల వద్ద ముగిశాయి. గత నెల 5 తర్వాత సెన్సెక్స్‌ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు లాభపడటం ఇదే తొలిసారి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు లాభపడ్డాయి. ప్రభుత్వ రంగ ఆయిల్, గ్యాస్‌ షేర్లు నష్టపోవడంతో లాభాలు తగ్గాయి.  

ఐటీ షేర్ల హవా: రూపాయి పతనం కారణంగా ఐటీ కంపెనీల ఆదాయాలు పెరుగుతాయనే అంచనాలతో ఐటీ షేర్లు దూసుకుపోయాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ షేర్లు 6 శాతం వరకూ లాభపడ్డాయి. అమెరికా–చైనా మధ్య వాణిజ్య సంబంధాల విషయమై అనిశ్చితి కొనసాగడం, వాహన దిగుమతుల విషయమై అమెరికా ఆరంభించిన జాతీయ భద్రతా దర్యాప్తు తాజా సుంకాల విధింపునకు దారి తీస్తుందనే ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. వడ్డీరేట్ల పెంపు విషయమై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరీ దూకుడుగా వ్యవహరించబోదనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి.  
 

>
మరిన్ని వార్తలు