10,500 దిగువకు నిఫ్టీ

10 Feb, 2018 00:55 IST|Sakshi

మళ్లీ అమెరికా మార్కెట్లో అలజడి

పెరుగుతున్న బాండ్‌ ఈల్డ్స్‌

407 పాయింట్లు క్షీణించి 34,006కు సెన్సెక్స్‌

122 పాయింట్లు పతనమై 10,455కు నిఫ్టీ  

ఒక్క రోజు విరామం తర్వాత స్టాక్‌ సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. ప్రపంచ మార్కెట్ల పతనం ప్రభావంతో స్టాక్‌ సూచీలు శుక్రవారం భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 10,500 పాయింట్ల దిగువకు పడిపోగా, సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 34 వేల పాయింట్ల దిగువకు పతనమైంది. బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుతుండటంతో వడ్డీరేట్లకు రెక్కలు వస్తాయనే అంచనాలతో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు కుదేలయ్యాయి.

లోహ, విద్యుత్తు, కన్సూమర్‌ డ్యూరబుల్‌ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 407 పాయింట్ల నష్టంతో 34,006 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు పతనమై 10,455 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలు రెండూ ఐదు వారాల కనిష్టానికి పడిపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 563 పాయింట్లు, నిఫ్టీ 179 పాయింట్లు పతనమయ్యాయి.  వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 1,061 పాయింట్లు, నిఫ్టీ 306 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  

అమెరికాలో నిరుద్యోగం తగ్గిందని, ఉద్యోగాలు పెరిగాయని వరుసగా రెండో వారమూ గణాంకాలు వెల్లడించాయి. దీంతో ద్రవ్యోల్బణం మరింతగా పెరుగుతుందని, వడ్డీరేట్లు పెరుగుతాయనే అంచనాలతో అమెరికా స్టాక్‌ సూచీలు భారీగా నష్టపోయాయి. గురువారం అమెరికా డోజోన్స్‌ 4 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 3.7 శాతం చొప్పున నష్టపోయాయి. డోజోన్స్‌ సూచీ 1,033 పాయింట్లు క్షీణించి 23,860 పాయింట్లకు పతనమైంది.

డోజోన్స్‌ చరిత్రలో ఇదే రెండో అత్యధిక పతనం. ఇక అక్కడ వడ్డీరేట్లు పెరిగితే భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న స్టాక్‌మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహానికి గండి పడుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా ప్రపంచమార్కెట్లతో పాటు మన మార్కెట్‌ కూడా నష్టపోయింది. పెరుగుతున్న బాండ్‌ ఈల్డ్స్‌ ఆకర్షణీయంగా ఉండటంతో ఈక్విటీల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని నిపుణులంటున్నారు. జపాన్‌ నికాయ్‌ 2.5 శాతం, హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 1 శాతం చొప్పున నష్టపోగా,  చైనా షాంగై సూచీ 0.7 శాతం లాభపడింది.  

ప్రమోటర్‌ సంస్థలకు రుణంగానే ఇచ్చాం: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌
ప్రమోటర్లయిన సింగ్‌ సోదరులు బోర్డు అనుమతి లేకుండా రూ.473 కోట్ల నిధులను తమ సొంత సంస్థల్లోకి మళ్లించారన్న ఆరోపణలపై ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ వివరణనిచ్చింది. ఆ నిధులను పూర్తి హామీతో కూడిన రుణంగానే ఇచ్చినట్లు తెలియజేసింది. తమ అనుబంధ సంస్థ ఫోర్టిస్‌ హాస్పిటల్స్‌ ద్వారా ఇచ్చిన ఈ రుణం రీపేమెంటు కూడా ఇప్పటికే మొదలయిందని వెల్లడించింది.

మరిన్ని వార్తలు