కొత్త గరిష్టానికి నిఫ్టీ

18 Aug, 2018 02:28 IST|Sakshi

సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు

బ్యాంక్, ఫార్మా, లోహ షేర్లకు లాభాలు  

ఇంట్రాడేలో 38వేలు దాటిన సెన్సెక్స్‌

284 పాయింట్ల లాభంతో 37,948 వద్ద ముగింపు

86 పాయింట్లు పెరిగి 11,471కు చేరిన నిఫ్టీ

నిఫ్టీకి ఇది ఆల్‌టైమ్‌ హై క్లోజింగ్‌

సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కలసిరావడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిసింది. ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ, బ్యాంకింగ్, ఫార్మా  షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరగడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కొత్త గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం చర్చలు జరపడానికి అమెరికా, చైనాలు ముందుకు రావడంతో ప్రపంచ మార్కెట్లు పరుగులు పెట్టాయి. కొనసాగుతున్న దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సానుకూల ప్రభావం చూపుతున్నాయని నిపుణులంటున్నారు.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 284 పాయింట్ల లాభంతో 37,948 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 11,471 పాయింట్ల వద్ద ముగిశాయి.  ఇక వారం పరంగా చూస్తే, వరుసగా నాలుగో వారమూ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 79 పాయింట్లు, నిఫ్టీ 41 పాయింట్ల చొప్పున పెరిగాయి.   లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌  రోజంతా ఆదే జోరును కొనసాగించింది. కొనుగోళ్ల జోరుతో 359 పాయింట్ల లాభంతో 38,022 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని తాకింది. ఇంట్రాడేలో నిఫ్టీ 101 పాయింట్ల వరకూ లాభపడింది.

లాభాలు ఎందుకంటే...
వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గించుకోడానికి చైనా, అమెరికాలు చర్చలు జరపాలని నిర్ణయించాయి.
  టర్కీని ఆదుకోవడానికి ఖతారు 1,500 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించడంతో టర్కీ కరెన్సీ లిరా కోలుకుంది. ఈ రెండు సానుకూలాంశాల కారణంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, యూరప్‌ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.  
మొండి బకాయిల సమస్యకు  రూపొందించిన పీసీఏ నిబంధనలను మళ్లీ పరిశీలించాలంటూ ఆర్‌బీఐపై ఒత్తిడి పెరుగుతోందన్న వార్తలతో బ్యాంక్‌ షేర్లు పెరిగాయని నిపుణులంటున్నారు.  
♦  గురువారం డాలర్‌తో రూపాయి మారకం ఆల్‌ టైమ్‌ కనిష్ట స్థాయికి పడిపోయింది. పార్శి కొత్త సంవత్సరం కారణంగా ఫారెక్స్‌ మార్కెట్‌ శుక్రవారం పనిచేయక పోవడం కలసివచ్చింది. 
♦   అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగిస్తుందని, దీనితో చమురుకు డిమాండ్‌ తగ్గుతుందనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గాయి.
 సెప్టెంబర్‌ క్వార్టర్‌ అవుట్‌లుక్‌ పాజిటివ్‌గా ఉండనున్నదన్న అంచనాలతో పేపర్‌ షేర్లు పెరిగాయి.

మరిన్ని వార్తలు