నిఫ్టీ జోరు- 9000 దాటేసింది

20 May, 2020 16:00 IST|Sakshi

ఇంట్రాడేలో నిఫ్టీ డబుల్‌ సెంచరీ

సెన్సెక్స్‌ 622 పాయింట్ల హైజంప్‌

30,819 వద్ద ముగింపు

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ ప్లస్‌

ఫార్మా ఇండెక్స్‌ 4 శాతం అప్‌

లాక్‌డవున్‌ కొనసాగుతున్నప్పటికీ పలు ఆంక్షలను సడలించిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగో‍ళ్లకే కట్టుబడటంతో రోజంతా లాభాల మధ్యే కదిలాయి. యూరోపియన్‌ మార్కె‍ట్లు సైతం 3 శాతం పుంజుకోవడంతో చివరి గంటలో మరింత బలపడ్డాయి. వెరసి సెన్సెక్స్‌ 622 పాయింట్లు జంప్‌చేసి 30,819 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 187 పాయింట్లు జమ చేసుకుని 9,067 వద్ద నిలిచింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,000 పాయింట్ల మార్క్‌ ఎగువన స్థిరపడింది. పలు రంగాలలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ కావచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 30,878 వద్ద గరిష్టాన్నీ, 30,158 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక నిఫ్టీ సైతం 9094- 8875 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

రియల్టీ, ఆటో, బ్యాంకింగ్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ఫార్మా 4 శాతం ఎగసింది. ఈ బాటలో రియల్టీ, బ్యాంకింగ్‌, ఆటో 2 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్‌ఎం, బీపీసీఎల్‌, గెయిల్‌, ఎల్‌అండ్‌టీ, యూపీఎల్‌, శ్రీ సిమెంట్‌, ఐషర్‌, గ్రాసిమ్‌ 6-5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌ 7 శాతం పతనంకాగా.. ఇండస్‌ఇండ్‌, హీరో మోటో, వేదాంతా, ఎయిర్‌టెల్‌ 2.6-0.6 శాతం మధ్య డీలాపడ్డాయి.

పేజ్‌ జూమ్‌
డెరివేటివ్స్‌లో పేజ్‌ ఇండస్ట్రీస్‌, చోళమండలం, డీఎల్‌ఎఫ్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, అరబిందో, పీవీఆర్‌, బీపీసీఎల్‌ 7.5-6 శాతం మధ్య ఎగశాయి. కాగా.. నౌకరీ, మైండ్‌ట్రీ, అదానీ పవర్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, సీఈఎస్‌సీ, అపోలో టైర్‌ 2.4-1.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.5-1.2 శాతం చొప్పున పెరిగాయి. ట్రేడైన షేర్లలో 1285 లాభపడగా.. 1031 నష్టపోయాయి.

విక్రయాల బాటలోనే..
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1328 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ. 1660 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 2513 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌ సైతం రూ. 152 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. 

మరిన్ని వార్తలు