అంతర్జాతీయ అంశాలు, ఫలితాలే దిక్సూచి

6 Jul, 2020 05:02 IST|Sakshi

టీసీఎస్, డీమార్ట్, కర్ణాటక బ్యాంక్, సౌత్‌ ఇండియా బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలు ఈవారంలోనే..

శుక్రవారం వెల్లడికానున్న మే నెల పారిశ్రామికోత్పత్తి డేటా

కరోనా వ్యాప్తి పరిణామాలపై ఇన్వెస్టర్ల దృష్టి

న్యూఢిల్లీ: దేశీ స్టాక్‌ మార్కెట్‌ గతవారంలో 2 శాతం లాభాలను నమోదుచేసింది. మూడు వారాల్లో 6 శాతం ఎగసింది. మార్చి 23 నాటి కనిష్టస్థాయి నుంచి ఏకంగా 42 శాతం లాభపడింది. నిఫ్టీ 7,511 పాయింట్ల నుంచి మళ్లీ 10,600 స్థాయిని అధిగమించింది. ఇక్కడ నుంచి ఎటువైపు ప్రయాణం చేస్తుందనే అనే ఉత్కంఠభరిత వాతావరణంలో కంపెనీలు ప్రకటించనున్న 2020–21 మొదటి త్రైమాసిక ఫలితాలు, ఆర్థికాంశాలు మార్కెట్‌ దిశను నిర్దేశించనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) గురువారం క్యూ1 ఫలితాలను ప్రకటించడం ద్వారా ఐటీ రంగ త్రైమాసిక ఫలితాల బోణీ కొట్టనుంది. ప్రధాన సూచీల ట్రెండ్‌కు ఇది కీలకంకానుందని విశ్లేషణ. ఈ అంశాలకు తోడు రాష్ట్రాల లాక్‌డౌన్‌ ప్రకటనలు,  ట్రేడ్‌వార్‌ వంటి ప్రతికూల అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఇక ఇదేవారంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ (డీమార్ట్‌), కర్ణాటక బ్యాంక్, సౌత్‌ ఇండియా బ్యాంక్‌ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఆయా అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి.

ఐఐపీ డేటా: మేనెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్నాయి.  చైనా జూన్‌ నెల ద్రవ్యోల్బణ డేటా, జపాన్‌ మేనెల మెషినరీ ఆర్డర్ల గణాంకాలు గురువారం విడుదలకానున్నాయి. మార్కిట్‌ సర్వీసెస్, కాంపోజిట్‌ పీఎంఐ డేటాను అమెరికా సోమవారం ప్రకటించనుంది.

మరిన్ని వార్తలు