అంతర్జాతీయ అంశాలు బేఖాతర్‌!

14 Mar, 2019 00:30 IST|Sakshi

రెండోసారి వీగిన బ్రెగ్జిట్‌ బిల్లు  ప్రపంచ మార్కెట్లకు నష్టాలు 

మన మార్కెట్‌ మాత్రం ముందుకే...  

217 పాయింట్లు పెరిగి37,752కు సెన్సెక్స్‌ 

41 పాయింట్ల లాభంతో 11,342కు నిఫ్టీ

అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రం గానే ఉన్నప్పటికీ, మన మార్కెట్లో బుధవారం లాభాలు కొనసాగాయి. బ్యాంక్, ఇంధన షేర్లలో కొనుగోళ్ల జోరుతో వరసగా మూడో రోజూ స్టాక్‌మార్కెట్లో ఎలక్షన్‌ ర్యాలీ కొనసాగింది. ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు రేట్ల తగ్గింపు నిర్ణయానికి అనుకూలంగా ఉండటం కలసివచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌  217 పాయింట్ల లాభంతో 37,752 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 11,342 పాయింట్ల వద్ద ముగిశాయి. సూచీలకు ఈ ఏడాది గరిష్ట స్థాయిలు ఇవే. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం జోరుగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత ఎగబాకుతుండటం సానుకూల ప్రభావం చూపుతున్నాయి.  

ఒడిదుడుకుల్లో సూచీలు... 
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఎన్‌డీఏనే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు లాభాల జోరుకు దోహదం చేస్తున్నాయని విశ్లేషకులంటున్నారు. అయితే బ్రెగ్జిట్‌ బిల్లు రెండోసారి కూడా వీగిపోవడం తో  ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. దీంట్లో మన మార్కెట్లో కూడా ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లో లోహ, ఫార్మా, టెక్నాలజీ షేర్లపై పడింది. ఈ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఈ రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఒక దశలో 57 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మరో దశలో 261 పాయింట్లు ఎగసింది.  ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై, స్వల్ప లాభాల్లో  ముగిశాయి.  

విమాన షేర్లకు ‘బోయింగ్‌’ రద్దు దెబ్బ 
భద్రత కారణాల రీత్యా బోయింగ్‌737 మ్యాక్స్‌ 8 విమాన సర్వీసులను నిలిపేయాలంటూ  విమాన యాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. దీనితో బోయింగ్‌ విమానాలు కలిగిఉన్న స్పైస్‌జెట్, జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు పడ్డాయి. 

ఆల్‌టైమ్‌ హైకి బ్యాంక్‌ నిఫ్టీ  
బ్యాంక్‌ నిఫ్టీ ఇంట్రాడేలో, ముగింపులోనూ ఆల్‌టైమ్‌ హై రికార్డ్‌లను సృష్టించింది.  బ్యాంక్‌ నిఫ్టీతో పాటు పలు షేర్లు కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అర్‌వింద్‌ ఫ్యాషన్స్, సీఈఎస్‌సీ వెంచర్స్,  రిలయన్స్‌ ఇండస్ట్రీస్, యూపీఎల్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇంట్రాడేలో బ్యాంక్‌ నిఫ్టీ 28,928 ఆల్‌టైమ్‌ హైని తాకింది.  

బజాజ్‌ కన్సూమర్‌ కేర్‌లో 7 % ప్రమోటర్‌ వాటా విక్రయం
బజాజ్‌ కన్సూమర్‌ కేర్‌ కంపెనీ ప్రమోటర్‌ సంస్థలు 6.85 శాతం వాటాను విక్రయించాయి. ఈ ప్రమోటర్‌ సంస్థలు బజాజ్‌ కన్సూమర్‌ కేర్‌లో ఉన్న తమ తమ వాటాల్లో 6.85 శాతం వాటాకు సమానమైన షేర్లను బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా విక్రయించాయని బజాజ్‌ కన్సూమర్‌ కేర్‌ తెలిపింది. ఒక్కో షేర్‌ను సగటున రూ.316.7 ధరకు విక్రయించాయని, మొత్తం ఈ షేర్ల వాటా విక్రయ విలువ రూ.320 కోట్లని పేర్కొంది. 

మరిన్ని వార్తలు