పడేసిన ప్రపంచ పరిణామాలు  

4 Dec, 2019 03:27 IST|Sakshi

54 పాయింట్ల నష్టంతో 11,994 వద్ద నిఫ్టీ ముగింపు  

127 పాయింట్లు పతనమై 40,675కు సెన్సెక్స్‌... 

వాణిజ్య యుద్ధం మరింతగా ముదరడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్‌ కూడా మంగళవారం నష్టపోయింది. గత కొన్ని రోజులుగా మన మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం రూ.1,732 కోట్ల మేర నికర అమ్మకాలు జరపడం, వృద్ధి అంచనాలను రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ తగ్గించడం, ఇటీవల బాగా పెరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టెలికం తదితర షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 12,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. 54 పాయింట్ల నష్టంతో 11,994 పాయింట్ల వద్దకు చేరింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 127 పాయింట్లు పతనమై 40,675 పాయింట్ల వద్ద ముగిసింది. మరో రెండు రోజుల్లో రేట్ల విషయమై ఆర్‌బీఐ నిర్ణయం వెలువడనున్నందున ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు.  బ్రెజిల్, అర్జెంటినాల దిగుమతులపై సుంకాలు విధించాలని తాజాగా అమెరికా నిర్ణయించింది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం ముగింపుపై నీలినీడలు ఉన్నాయి. దీనితో వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరుగు తాయయన్నభయాలున్నాయి. దీంతో సోమవారం అమెరికా, యూరప్‌ మార్కె ట్లు భారీగానే పతనమయ్యాయి.

ఈ ప్రభావంతో మంగళవారం ఇతర ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్‌ కూడా నష్టపోయింది. హాంకాంగ్‌లో చైనాకు వ్యతి రేకంగా జరుగుతున్న నిరసనలకు అమెరికా మద్దతు ఇచ్చినందుకు ప్రతిగా  అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థలపై చైనా ఆంక్షలు విధించింది. ఇది ప్రపంప మార్కెట్ల పతనానికి మరింతగా ఆజ్యం పోసింది.  

మరిన్ని వార్తలు