10,100 వద్ద నిఫ్టీ ప్రారంభం

5 Jun, 2020 09:40 IST|Sakshi

300 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

బ్యాంకింగ్‌, అటో, మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు 

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు

లాభాల స్వీకరణతో నిన్న నష్టాలో ముగిసిన మార్కెట్‌ శుక్రవారం మళ్లీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌  291 పాయింట్లు పెరిగి 34272.23 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 10100 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఒక్క రియల్టీ రంగ షేర్లకు తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్‌, అటో, మెటల్‌ షేర్లు మార్కెట్‌ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం లాభపడి 20,585.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ తో పాటు మొత్తం 32కంపెనీలు మార్చి క్వార్టర్‌ ఫలితాలను వెల్లడించనున్నాయి. 

ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 300 పాయింట్లు పెరిగి 34268 వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో 10119.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అబుదాబి ఆధారిత ముబదలా కంపెనీ రిలయన్స్‌ జియోలో 1.85శాతం వాటాను రూ.9,093.6 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటా విక్రయ వార్తలతో రిలయన్స్‌ షేరు మునుపటి ముగింపు(రూ.1579.95)తో పోలిస్తే 2.38శాతం లాతపడి రూ.1617.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 


దేశీయ మొబైల్‌ ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌లో అమెజాన్‌ కంపెనీ 2డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందని, చర్చలు తుది దశలో ఉన్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ నిన్నటి ముగింపు(రూ.573.15)తో పోలిస్తే 3శాతం లాభంతో రూ.590.00వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

బలహీనంగా అంతర్జాతీయ సెంటిమెంట్‌ 
అమెరికా ఫ్యూచర్లు ఫ్లాట్‌గా అవుతున్న తరుణంలో నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌, చైనా, హాంగ్‌కాంగ్‌, ఇండోనేషియా, థాయిలాండ్‌ మార్కెట్లు నష్టాల్లో, సింగపూర్‌, తైవాన్‌, కొరియా దేశాల మార్కెట్లు లాభాల్లో కదులుతున్నాయి. ట్రేడర్ల లాభాల స్వీకరణతో పాటు నేడు ఈ దేశ ఉద్యోగ గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెసర్ల అప్రమత్తత వహించారు. దీంతో అమెరికా మార్కెట్ల వరుస 4రోజుల లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్‌ పడింది. ఆ దేశ బెంచ్‌మార్క్‌ సూచీలు ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు అరశాతం నష్టంతో ముగిశాయి.

హిందాల్కో, ఇన్ఫ్రాటెల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటాస్టీల్‌, టాటామోటర్స్‌ షేర్లు 3శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి. బ్రిటానియా, హిందూస్థాన్‌ యూనిలివర్‌, పవర్‌గ్రిడ్‌, బీపీసీఎల్‌, టీసీఎస్‌ షేర్లు అరశాతం నుంచి 1.50వాతం నష్టపోయాయి. 

మరిన్ని వార్తలు