100 పాయింట్ల లాభంతో మొదలైన నిప్టీ

26 May, 2020 09:24 IST|Sakshi

315 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ 

ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు 

మూడు సెలవు రోజుల అనంతరం మొదలైన భారత స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సెన్సెక్స్‌ 315 పాయింట్లు లాభంతో 30987 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 9140 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. సప్లై క్షీణతతో క్రూడాయిల్‌ ధరలు పతనం ఆగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ఫ్యూచర్స్‌ బ్యారెల్‌ ధర 35.65 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. 
 

ఉదయం గం 9:20ని.లకు సెన్సెక్స్ 390 పాయింట్లు పెరిగి 31063 వద్ద, నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 9147 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఒక్క మీడియా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బ్యాంక్‌నిఫ్టీ ఇండెక్స్‌ 2.12శాతం లాభంతో 17,661 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఆసియాలో నేడు ప్రధాన దేశాలకు చెందిన స్టాక్‌ సూచీలన్నీ 2శాతం వరకు లాభపడ్డాయి. జపాన్‌ దేశ ప్రధాని తమ దేశంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ఎత్తివేసి ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు  పూర్తిస్థాయి అనుమతులు ఇస్తున్నట్లు ఈ దేశ ప్రధాని షిజో అబే ప్రకటించారు. ఫలితంగా జపాన్‌ ఇండెక్స్‌  నికాయ్‌ 2.50శాతం లాభపడింది. హాంగ్‌కాంగ్‌ నగరంలో అల్లరు సద్దుమణగడంతో చైనాతో పాటు హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌లు 1.50శాతం పెరిగాయి. అలాగే సింగపూర్, తైవాన్, కొరియా, ఇండినేషియా దేశాలకు మార్కెట్లు 1.50శాతం వరకు ర్యాలీ చేశాయి. అమెరికా బయోటెక్‌ సంస్థ నోవావాక్స్‌ రూపొందించిన కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను మొదటిసారిగా మనుషులపై ప్రయోగిస్తున్నట్లు ప్రకటనతో అమెరికా ఫ్యూచర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 


దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ కొత్త రికార్డు స్థాయిలో నమోదు అవుతుండం మార్కెట్‌ను కలవరపెడుతోంది. సోమవారం ఒక్కరోజే 6977 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1.44లక్షల మంది కరోనా వ్యాధి సోకింది. ఇప్పటి వరకు 4117 మంది మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టిని సారించాయి. దీపక్‌ నైట్రేట్, మాక్స్‌ ఫైనాన్షియల్, టోరెంటో ఫార్మాతో పాటు సుమారు 19 కంపెనీలు నేడు తమ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

ఐషర్‌ మోటర్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హిందాల్కో, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి. బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, హీరోమోటోకార్ప్‌, జీ లిమిటెడ్‌, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు అరశాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి.

మరిన్ని వార్తలు