అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళన

9 Mar, 2019 00:38 IST|Sakshi

నాలుగు రోజుల లాభాలకు  బ్రేక్

ప్రపంప మార్కెట్ల పతనం

కీలక మద్దతు స్థాయిల ఎగువునే ముగిసిన సూచీలు 

54 పాయింట్ల పతనంతో 36,671కు సెన్సెక్స్‌

23 పాయింట్ల నష్టంతో 11,035కు నిఫ్టీ 

అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. దీంతో నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ఐటీ, లోహ షేర్లు నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 54 పాయింట్లు పతనమై 36,671 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 11,035 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే సెన్సెక్స్, నిఫ్టీలు కీలకమైన మద్దతు స్థాయిలపైనే ముగియగలిగాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌608 పాయింట్లు(1.68 శాతం), నిఫ్టీ 172 పాయింట్లు(1.58 శాతం) చొప్పున లాభపడ్డాయి. 

తగ్గిన నష్టాలు...
చైనా ఎగుమతి గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా ఉన్నాయి.   19 దేశాలతో కూడిన యూరప్‌ ప్రాంత జీడీపీ అంచనాలను యూరోపియన్‌ కేంద్ర బ్యాంక్‌ తగ్గించడంతో పాటు తాజాగా మరిన్ని తాజా రుణాలను ఇవ్వనున్నామని వెల్లడించింది. దీంతో అంతర్జాతీయ ఆర్థిక మందగమనం మరింత బలపడుతోందన్న ఆందోళన మరింత బలపడింది. దీంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. కాగా ముడి చమురు ధరలు దిగిరావడం,  ఇంట్రాడేలో రూపాయి 7 పైసలు బలపడటం(చివరకు రూపాయి 14 పైసల నష్టంతో 70.14 వద్ద ముగిసింది), విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటంతో నష్టాలు తగ్గాయి.   

160 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌....
సెన్సెక్స్‌ స్వల్ప లాభాలతోనే ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఆసియా మార్కెట్ల బలహీనతతో  నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 28 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మరో దశలో 132 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 160 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 49 పాయింట్ల వరకూ నష్టపోయింది. 

∙చైనాలో  అమ్మకాలు బాగా తగ్గడంతో టాటా మోటార్స్‌ విలాస  కార్ల విభాగం, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ అంతర్జాతీయ అమ్మకాలు 4 శాతం తగ్గాయి. దీంతో టాటా మోటార్స్‌ షేర్‌ 4 శాతం నష్టంతో రూ. 182 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.

∙మార్కెట్‌ నష్టపోయినప్పటికీ, అలహాబాద్‌ బ్యాంక్‌ షేర్‌ ఏడాది గరిష్ట స్థాయి, రూ.58ను తాకింది. చివరకు 4.3 శాతం లాభంతో రూ.57.05 వద్ద ముగిసింది.  రూ.6,896 కోట్ల నిధులు అందిస్తామని కేంద్రం ప్రకటించినప్పటి నుంచి, ఈ షేర్‌ గత మూడు వారాలుగా ర్యాలీ జరుపుతోంది.

∙సిగరెట్ల ధరలను పెంచిన నేపథ్యంలో తయారీ సంస్థ... వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ కూడా ఏడాది గరిష్ట స్థాయి, రూ.3,580ను తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.3,519 వద్ద ముగిసింది. 

∙మార్జిన్లు మెరుగుపడతాయని, మంచి నికర లాభం సాధించగలదన్న అంచనాలతో ఇప్కా ల్యాబ్స్‌ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి రూ.914ను తాకింది. 1.7 శాతం లాభంతో రూ.884 వద్దకు చేరింది. 

∙ఈ నెల 14న జరిగే బోర్డ్‌ సమావేశంలో షేర్ల బైబ్యాక్‌పై చర్చించనున్నారన్న వార్తల కారణంగా ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌ 6 శాతం లాభంతో రూ. 1,094 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు