ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు భారీ డిమాండ్‌

8 Jul, 2020 14:37 IST|Sakshi

పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 5.50శాతం జంప్‌

ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్ త‌గ్గింపు

మార్కెట్‌ పరిమిత శ్రేణిలో ట్రేడింగ్‌లో భాగంగా ప్రభుత్వ రంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 5శాతానికి పైగా లాభపడింది.  మార్కెట్‌ స్వల్పలాభాల ప్రారంభంలో భాగంగా ఈ ఇండెక్స్‌ 1,480.50 వద్ద మొదలైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ ఒకదశలో 5.22శాతం లాభపడి 1555 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ నిన్నటి ముగింపు(1,477.80)తో పోలిస్తే 5శాతం లాభంతో 1,551.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా మహారాష్ట్ర బ్యాంక్‌ 9శాతం పెరిగింది. కెనరా బ్యాంక్‌ 8శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 6శాతం, పీఎన్‌బీ, జమ్మూకాశ్మీర్‌ బ్యాంక్‌, ఐఓబీ బ్యాంక్‌ యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 4శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ, సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంక్‌ షేర్లు 3శాతం ర్యాలీ చేశాయి. 

ఎస్‌బీఐ నుంచి మరో గుడ్ న్యూస్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్‌ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఎంసీఎల్ఆర్‌ను తగ్గించడం వరుసగా 14వ సారి కావడం విశేషం. కొత్త వడ్డీ రేట్లు జూలై 10 నుంచి అమలులోకి వస్తాయి. మూడు నెలల కాల వ్యవధిపై ఇకపై 6.65 శాతం వడ్డీ అమలులో ఉంటుంది. ఎంసీఎల్ఆర్ ఎంత తక్కువ ఉంటే కస్టమర్లకు హోమ్ లోన్ ఈఎంఐ అంత తగ్గుతుంది

అదేబాటలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర:
పూణే ఆధారిత బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కూడా ఎంసీఎల్‌ఆర్‌ను 20 బేసిన్‌ పాయింట్లు తగ్గించింది. దీంతో ఏడాదికాల వ్యవధిపై ఎంసీఎల్‌ఆర్‌  7.70శాతం నుంచి 7.50శాతానికి దిగిరానుంది. 

మరిన్ని వార్తలు