కొనసాగిన ‘రికార్డ్‌’ లాభాలు

8 Nov, 2019 05:35 IST|Sakshi

‘రియల్టీ నిధి’ జోష్‌

తుది దశకు అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందం 

ఇంట్రాడేలో, ముగింపులో కొత్త శిఖరాలకు సెన్సెక్స్‌

184 పాయింట్ల లాభంతో 40,654కు సెన్సెక్స్‌ 

12,000 పాయింట్లపైకి నిఫ్టీ 

46 పాయింట్లు పెరిగి 12,012 వద్ద ముగింపు  

సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హై రికార్డ్‌లు గురువారం కూడా కొనసాగాయి. రియల్టీ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం సంస్కరణలను ప్రకటించడం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు కావడం సానుకూల ప్రభావం చూపించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ దాదాపు ఐదు నెలల తర్వాత 12,000 పాయింట్లపైకి ఎగబాకింది. ఇక సెన్సెక్స్‌ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సృష్టించింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,688 పాయింట్లను తాకిన సెన్సెక్స్‌ చివరకు 184 పాయింట్ల లాభంతో 40,654 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 12,012 పాయింట్ల వద్దకు చేరింది. జీవిత కాల గరిష్ట స్థాయి, 12,103 పాయింట్లకు 91 పాయింట్ల దూరంలోనే ఉంది. వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం స్వల్పంగా పెరిగింది. లోహ, ఇంధన, రియల్టీ, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు లాభపడ్డాయి. వాహన, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.  

రూ.25,000 కోట్ల రియల్టీ నిధి...
రియల్టీ రంగంలో ఆగిపోయిన 1,600 ప్రాజెక్ట్‌ల కోసం రూ.25,000 కోట్ల నిధిని కేంద్రం ప్రకటించింది. కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించుతుండటం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, పరస్పరం విధించుకున్న సుంకాలను దశలవారీగా తొలగించుకోవడానికి అమెరికా–చైనాలు అంగీకారానికి రావడం.... ఈ అంశాలన్నింటి కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది.

మరిన్ని వార్తలు