12 ఏళ్లలో మొదటిసారి...

14 Mar, 2020 05:51 IST|Sakshi

నిఫ్టీ, సెన్సెక్స్‌లు 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ పరిమితిని తాకడంతో స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపేశారు.  ఇలా సర్క్యూట్‌ బ్రేకర్‌ కారణంగా ట్రేడింగ్‌ నిలిచిపోవడం గత 12 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ సర్క్యూట్‌ బ్రేకర్స్‌ సంగతేంటో చూద్దాం...

► స్టాక్‌ మార్కెట్లో అధిక స్థాయిల్లో నెలకొనే ఒడిదుడుకులను నివారించే ఉద్దేశంతో సర్క్యూట్‌ బ్రేకర్‌ విధానాన్ని అనుసరిస్తారు. సెన్సెక్స్, నిఫ్టీలు  10, 15, 20 శాతం... ఈ మూడు స్థాయిల్లో పెరిగినా, పతనమైనా, సర్క్యూట్‌ బ్రేకర్లు వర్తిస్తాయి.  

► 10 శాతం:  ఉదయం సెషన్‌లో  ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు ఆపేస్తారు. ఒంటి గంట నుంచి గం.2.30 ని. మధ్య అయితే 15 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపేస్తారు. గం.2.30.ని. తర్వాత ట్రేడింగ్‌ నిలిపివేత ఉండదు.  

► 15 శాతం: మధ్యాహ్నం ఒంటి గంటకు ముందు ట్రేడింగ్‌ను గం.1.45 నిమిషాలు నిలిపేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య అయితే 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను ఆపేస్తారు. మధ్యాహ్నం రెండు  గంటల తర్వాత అయితే ఆ రోజుకు పూర్తిగా ట్రేడింగ్‌ను నిలిపేస్తారు.  

► 20 శాతం ఉంటే...: ట్రేడింగ్‌ను ఆ రోజుకు పూర్తిగా ఆపేస్తారు.  

► 2008, జనవరి 22:   సర్క్యూట్‌ బ్రేకర్ల కారణంగా ట్రేడింగ్‌ నిలిచిపోయింది. లేమాన్‌ బ్రదర్స్‌ దివాలా తీయడంతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనం కావడంతో సెన్సెక్స్‌ 1,408 పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లకు పైగా పతనం కావడం ఇదే మొదటిసారి.

► 2009, మే 18:∙యూపీఏ ప్రభుత్వం రెండోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో సెన్సెక్స్‌ 17 శాతం (2,111 పాయింట్లు) లాభపడి 14,284 పాయింట్లకు ఎగసింది. ఆ ఒక్క రోజే రెండు సార్లు సెన్సెక్స్‌ సర్క్యూట్‌ బ్రేకర్లను తాకింది. 1992, మార్చి 2న అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఉదార ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టడంతో సెన్సెక్స్‌ 21 శాతం ఎగసింది. ఈ సందర్భంలో కూడా ట్రేడింగ్‌ను నిలిపేశారు.

మరిన్ని వార్తలు