గృహాలు కిందికి.. ఆఫీసులు పైకి!

11 Jan, 2018 00:12 IST|Sakshi

హైదరాబాద్‌లో గృహ రంగం ప్రారంభాల్లో 84 శాతం క్షీణత

ఆఫీసు లావాదేవీల్లో 5 శాతం వృద్ధి

పెద్దనోట్ల రద్దు, రెరా, జీఎస్‌టీలతో రియల్టీ కుదేల్‌

నైట్‌ఫ్రాంక్‌ ఇండియా 8వ ఎడిషన్‌లో వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ గృహ నిర్మాణ రంగంలో నూతన ప్రాజెక్ట్‌ల విషయంలో గణనీయమైన తగ్గుదల ఉందని, కార్యాలయాల మార్కెట్‌ మాత్రం కాసింత మెరుగ్గా ఉందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక తెలిపింది. హెచ్‌1తో పోలిస్తే నగరంలో జూలై–డిసెంబర్‌ (హెచ్‌2) మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు 84 శాతం క్షీణత, ఆఫీసు లావాదేవీల్లో మాత్రం 5 శాతం వృద్ధిని నమోదు చేసిందని నివేదిక వెల్లడించింది. దేశంలోని అన్ని ముఖ్య నగరాలతో పాటూ హైదరాబాద్‌లోని నివాస, కార్యాలయాల విభాగం పరిస్థితులపై క్షేత్రస్థాయిలోని వివరాలను నైట్‌ఫ్రాంక్‌  హైదరాబాద్‌ డైరెక్టర్‌ సామ్‌సన్‌ ఆర్థూర్‌ బుధవారమిక్కడ విడుదల చేశారు.

పెద్ద నోట్ల రద్దు, రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కారణంగా దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లోని రియల్టీ మార్కెట్‌పై ప్రభావం చూపించింది. హైదరాబాద్‌లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇక్కడ హెచ్‌1లో 2,571 యూనిట్లు ప్రారంభం కాగా.. హెచ్‌2లో 84 శాతం తగ్గుదలతో 940 యూనిట్లకే పరిమితమయ్యాయి.

అమ్మకాలూ డౌన్‌..
హెచ్‌2లో నగరంలో గృహాల అమ్మకాల్లోనూ 13 శాతం తగ్గుదల కనిపించింది. హెచ్‌1లో 7,901 యూనిట్లు అమ్ముడుపోగా.. హెచ్‌2లో 6,342 యూనిట్లకు చేరాయి. నగరంలో ఇంకా అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 2016తో పోలిస్తే 28,088 నుంచి 17,356 యూనిట్లకు తగ్గింది. అమ్మకాలు ఆశాజనకంగా ఉండటంతో రూ.50 లక్షల లోపు ఉండే అందుబాటు గృహాల ప్రాజెక్ట్‌ల వైపు నిర్మాణ సంస్థలు దృష్టిసారించాయి. దీంతో ఈ విభాగంలో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు 40 శాతం పెరిగాయి.

ఆఫీస్‌లో 5 శాతం వృద్ధి..
జూలై–డిసెంబర్‌ మధ్య కాలంలో హైదరాబాద్‌ ఆఫీసు రియల్టీ మార్కెట్‌ రికార్డుల మోత మోగించింది. ఈ 6 నెలల కాలంలో 3.34 మిలియన్‌ చ.అ. ఆఫీసు లావాదేవీలు జరిగాయి. హెచ్‌1లో ఇది 2.33 మిలియన్‌ చ.అ.లుగా ఉంది. అంటే 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే 2016 ఏడాదితో పోలిస్తే మాత్రం 2017లో ఆఫీసు విభాగ లావాదేవీలు 4 శాతం తగ్గాయి.

దేశంలోనూ సేమ్‌ సీన్‌!
2017 హెచ్‌2లో దేశంలోని 8 ప్రధాన మార్కెట్లలో గృహ రంగంలో క్షీణత, ఆఫీసు విభాగంలో వృద్ధిని నమోదు చేసింది. హెచ్‌1లో 62,738 యూనిట్లు ప్రారంభం కాగా.. హెచ్‌2లో 41 శాతం తగ్గుదలతో 40,832 యూనిట్లకు పరిమితమయ్యాయి. అమ్మకాల్లోనూ అంతే! హెచ్‌1లో 1,20,756 యూనిట్లు అమ్ముడుపోగా.. హెచ్‌2లో 2 శాతం క్షీణతతో 1,07,316కు చేరాయి. అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 2016లో 6,52,996 యూనిట్లు ఉండగా. 2017లో ఇవి 5,28,494 యూనిట్లకు తగ్గాయి.

9 శాతం అప్‌..
హెచ్‌2లో ఆఫీస్‌ విభాగంలో 22.5 మిలియన్‌ చ.అ. లావాదేవీలు జరిగాయి. హెచ్‌1లో 19.2 మిలియన్‌ చ.అలుగా ఉంది. 9 శాతం వృద్ధిని కనబర్చింది. విభాగాల వారీగా పరిశీలిస్తే.. ఐటీ, ఐటీఈఎస్‌ విభాగం 37 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ 14 శాతం, తయారీ రంగం 14 శాతం ఆఫీసు స్థలాన్ని ఆక్రమించాయి.

మరిన్ని వార్తలు