ఇన్ఫోసిస్..ఇన్వెస్టెర్రర్‌!

23 Oct, 2019 03:17 IST|Sakshi

షేరు 16 శాతం క్రాష్‌...

ఆరేళ్లలో అత్యంత భారీ పతనం

సీఈవో, సీఎఫ్‌వోలపై ఆరోపణలే కారణం

విచారణ జరిపిస్తామన్న చైర్మన్‌ నీలేకని

న్యూఢిల్లీ: ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ స్వయంగా సీఈవో సలిల్‌ పరేఖ్‌పై వచ్చిన ఆరోపణలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేరు కుదేలైంది. మంగళవారం ఏకంగా 16 శాతం పతనమైంది. గడిచిన ఆరేళ్లలో ఇంత భారీగా ఇన్ఫీ షేరు క్షీణించడం ఇదే తొలిసారి. మరోవైపు స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలు పెంచి చూపించేందుకు ఖాతాల గోల్‌మాల్‌ చేయిస్తున్నారని, అనైతిక విధానాలకు తెరతీశారని సలిల్‌ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌లపై వచ్చిన ఆరోపణల మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామంటూ ఇన్ఫీ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని స్పష్టం చేశారు. అంతర్గత ఆడిటర్లు ఈవైతో ఆడిట్‌ కమిటీ సంప్రతింపులు జరుపుతోందని, స్వతంత్ర విచారణ కోసం న్యాయసేవల సంస్థ శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కోని నియమించుకున్నామని స్టాక్‌ ఎక్సే్చంజీలకు నీలేకని తెలియజేశారు.

ఆడిట్‌ కమిటీ సిఫార్సులతో చర్యలు.. 
సంస్థలో అనైతిక విధానాల పేరిట ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న ఒక బోర్డు సభ్యుడికి గుర్తుతెలియని వారి నుంచి రెండు ఫిర్యాదులు వచ్చినట్లు నీలేకని తెలిపారు. వీటిలో ఒక దానిపై సెప్టెంబర్‌ 20వ తేదీ ఉండగా, రెండో దానిపై తేదీ లేకుండా ప్రజావేగు ఫిర్యాదు అని ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండింటినీ అక్టోబర్‌ 10న ఆడిట్‌ కమిటీ ముందు, మరుసటి రోజున బోర్డులో నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ సభ్యుల ముందు ఉంచినట్లు నీలేకని తెలిపారు. తేదీ లేని రెండో లేఖలో ప్రజావేగు ప్రధానంగా సీఈవో అమెరికా, ముంబైల పర్యటనల మీద ఆరోపణలు ఉన్నట్లు వివరించారు. ‘అక్టోబర్‌ 11న బోర్డు సమావేశం అనంతరం ప్రాథమిక విచారణకు సంబంధించి స్వతంత్ర అంతర్గత ఆడిటర్లతో (ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌) ఆడిట్‌ కమిటీ సంప్రతింపులు ప్రారంభించింది.

అక్టోబర్‌ 21న శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కో సంస్థను స్వతంత్ర విచారణ కోసం నియమించుకోవడం జరిగింది‘ అని ఆయన పేర్కొన్నారు. 11న బోర్డు సమావేశం తర్వాత తమ ఆడిటర్లకు (డెలాయిట్‌ ఇండియా) అన్ని విషయాలు పూర్తిగా తెలియజేసినట్లు నీలేకని తెలిపారు. ‘ఈమెయిల్స్‌ లేదా వాయిస్‌ రికార్డింగ్స్‌ లాంటివేవీ మాకు అందలేదు. అయినప్పటికీ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇది నిష్పాక్షికంగా జరిగేలా చూసేందుకు సీఈవో, సీఎఫ్‌వో దీనికి దూరంగా ఉంటారు‘ అని ఆయన వివరించారు. విచారణలో వెల్లడయ్యే వివరాలను బట్టి ఆడిట్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం బోర్డు తగు చర్యలు తీసుకుంటుందని నీలేకని చెప్పారు.

సీఈవో, సీఎఫ్‌వోలపై అనైతిక విధానాల ఆరోపణలు ఐటీ దిగ్గజం ఇన్ఫీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కంపెనీ షేరు ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా మంగళవారం కుప్పకూలింది. ప్రజావేగుల ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నామంటూ సంస్థ చైర్మన్‌ నీలేకని దిద్దుబాటు చర్యలు ప్రారంభించినప్పటికీ.. అమెరికాలో ఇన్ఫీని ఇరకాటంలో పెట్టేందుకు అక్కడి ఇన్వెస్టర్లు క్లాస్‌ యాక్షన్‌ దావాకు సిద్ధమవుతున్నారు. దీంతో.. రెండేళ్ల క్రితం సీఈవో, ప్రమోటర్ల మధ్య వివాదాలతో తలెత్తిన సంక్షోభ ప్రభావాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇన్ఫోసిస్‌ .. తాజాగా మరో సంక్షోభంలోకి జారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇన్ఫీ షేరు మంగళవారం ఎలా పడిపోయిందంటే..
షేరు క్రితం ముగింపు ధర రూ.768, ఆరంభం 10 శాతం డౌన్‌ షేరు ధర రూ.691, ఇంట్రాడేలో కనిష్ట ధర రూ.638 17 శాతం క్రాష్‌ , షేరు ముగింపు ధర రూ. 643,16% డౌన్‌

53 వేల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ హుష్‌.. 
ప్రజావేగుల ఆరోపణలపై ఆందోళనలతో ఇన్ఫీ షేరు కుదేలవడంతో కంపెనీ మార్కెట్‌ విలువ ఒకే రోజులో ఏకంగా రూ. 53,451 కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. మార్కెట్‌ వేల్యుయేషన్‌ రూ. 2,76,300 కోట్లకు తగ్గింది. మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా పతనమైన పెద్ద కంపెనీ షేరు ఇదే. బీఎస్‌ఈలో షేరు ఒక దశలో 16.86 శాతం పతనమై రూ. 638.30 స్థాయిని కూడా తాకింది. 2013 ఏప్రిల్‌ తర్వాత ఒకే రోజున ఇంత స్థాయిలో షేరు క్షీణించడం ఇదే తొలిసారి. చివరికి 16.21 శాతం క్షీణించి రూ. 643.30 వద్ద క్లోజయ్యింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో 16.65 శాతం క్షీణించి రూ. 640 వద్ద క్లోజయ్యింది. మరోవైపు, అమెరికా మార్కెట్లో సోమవారం 14 శాతం పతనమైన ఇన్ఫీ ఏడీఆర్‌ (అమెరికన్‌ డిపాజిటరీ రిసీట్‌) పతనం మంగళవారం కూడా కొనసాగింది. ఒక దశలో మరో 4 శాతం దాకా పడింది.

ఇదీ వివాదం..
కంపెనీ లాభాలు పెంచి చూపించేందుకు సలిల్‌ పరేఖ్, ఆయనకు తోడుగా నీలాంజన్‌ రాయ్‌ ఖాతాలు గోల్‌మాల్‌ చేయిస్తున్నారంటూ కొందరు ఉద్యోగుల బృందం.. ఇన్ఫీ బోర్డుకు, అమెరికాలోని విజిల్‌బ్లోయర్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రాంకు చేసిన ఫిర్యాదులు సోమవారం వెలుగులోకి వచ్చాయి. గత రెండు త్రైమాసికాలుగా ఇలాంటి ధోరణులు పెరిగాయని, అనైతిక విధానాలకు అడ్డు చెప్పిన ఉద్యోగులను పక్కన పెట్టడం జరుగుతోందని ప్రజావేగులు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఈమెయిల్స్, వాయిస్‌ రికార్డింగ్స్‌ అన్నీ తమ దగ్గర ఉన్నాయని, తగిన సందర్భంలో అందజేస్తామని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాల ఆరోపణలతో రెండేళ్ల క్రితం ఇన్ఫీ ఉక్కిరిబిక్కిరైన  సంగతి తెలిసిందే. దీనిపైనే ప్రమోటర్లతో విభేదాలు రావడంతో సీఈవో విశాల్‌ సిక్కా అర్ధంతరంగా నిష్క్రమించారు. కొత్త సీఈవోగా సలిల్‌ పరేఖ్‌ వచ్చిన తర్వాత మళ్లీ ఇన్ఫీ మెల్లిగా గాడిన పడటం మొదలైంది. అయితే ఇంతలోనే ఆయనపైనా అవకతవకల ఆరోపణలు రావడంతో ఇన్ఫీ వ్యవహారాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

మరిన్ని వార్తలు