డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీకి మరో షాక్‌

21 May, 2018 17:15 IST|Sakshi
నీరవ్‌ మోదీ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీకి మరో షాక్‌ తగిలింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును భారీ కుంభకోణంలో ముంచెత్తి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీకి చెందిన 170 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాత్కాలికంగా అటాచ్‌ చేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద మోదీ ఆస్తులను తాత్కాలికంగా అటాచ్‌ చేసినట్టు ఈడీ చెప్పింది. వీటిలో నీరవ్‌ మోదీ ఫైర్‌స్టార్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ముంబై, సూరత్‌లో ఉన్న పండ్ర ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఉన్నాయి. మరో అత్యంత విలువైన ప్రాపర్టీ అయిన హెచ్‌సీఎల్‌ హౌజ్‌ కూడా ఈ అటాచ్‌మెంట్స్‌లో ఉంది. దీని విలువ దాదాపు 63 కోట్ల రూపాయలు.

ఆస్తుల అటాచ్‌మెంట్‌ మాత్రమే కాక, ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ నీరవ్‌ మోదీకి, సోదరుడు నిశాల్‌కు చెందిన బ్యాంకు అకౌంట్లు, వీరి సంస్థల ప్రైవేట్‌, పబ్లిక్‌ బ్యాంకు అకౌంట్లను కూడా అటాచ్‌ చేసుకుంది. మొత్తం వీటిలో 104 బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, వీటి విలువ 58 కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలిసింది. నీరవ్‌మోదీకి చెందిన పలు ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లను, నీరవ్‌ మోదీ సంస్థలకు చెందిన 4 కోట్ల రూపాయల విలువైన 11 వాహనాలను ఏజెన్సీ అటాచ్‌ చేసినట్టు వెల్లడైంది. పీఎన్‌బీలో వీరు దాదాపు రూ.13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో వీరి సంస్థలపై, ఆస్తులపై, బ్యాంకు అకౌంట్లపై దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపిస్తున్నాయి. మరోవైపు, నీరవ్‌ మోదీ బంధువులకు కూడా సమన్లు జారీ అయ్యాయి. స్కాంకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీని, ఆయన మేనమామ మెహుల్‌ చౌక్సిలను ఎలాగైనా భారత్‌కు రప్పించాలని ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు