నీరవ్‌ మోదీ ఆస్తుల వేలం

5 Apr, 2018 00:41 IST|Sakshi

దివాలాకు అనుమతించిన అమెరికా కోర్టు

పీఎన్‌బీ ప్రయత్నాలకు విఘాతం

మే 5 నుంచి వేలం ప్రక్రియ మొదలు  

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.13,000 కోట్ల మేర టోపీ పెట్టిన నీరవ్‌ మోదీ కంపెనీ ఫైర్‌స్టార్‌ డైమండ్స్, ఇతర కంపెనీల ఆస్తుల విక్రయానికి అమెరికాలోని బ్యాంక్రప్టసీ కోర్టు ఆమోదం తెలిపింది. ఈ నెల 27 వరకు బిడ్లు సమర్పించేందుకు అవకాశం ఇవ్వగా, మే 5 నుంచి ఆస్తుల వేలం ప్రక్రియ మొదలు కానుంది. విలువ తగ్గించి అమ్మడం వల్ల రుణదాతలు తామిచ్చిన రుణాలు వసూలు చేసుకునే అవకాశాలు పరిమితమైపోతాయని పేర్కొంటూ   పీఎన్‌బీ ఆందోళన వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది. వేలం వేసే ఆస్తులను మోదీ సంస్థలు పీఎన్‌బీ నుంచి పొందిన నిధులతో సమకూర్చుకున్నాయా లేక బకాయిదారులు నల్లధన చలామణికి పాల్పడ్డారా అన్నదానిపై మోదీ సంస్థలు తగిన సమాచారం ఇవ్వలేదని పీఎన్‌బీ అమెరికా కోర్టుకు గత నెల 28న విచారణ సందర్భంగా వివరించింది.

అయినప్పటికీ ఆస్తుల వేలానికి కోర్టు అనుమతిస్తూ గత నెల 29న ఆదేశాలు జారీ చేసింది. బకాయిదారులు తమ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉపశమనం కల్పించాలని కోరడం సహేతుకమేనంటూ, నష్టాల్లో ఉన్న కంపెనీలు తగిన వ్యాపార కారణాలను చూపించి బిడ్డింగ్‌కు అనుమతి పొందినట్లు కోర్టు స్పష్టం చేసింది. పీఎన్‌బీ అభ్యంతరాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఆస్తుల వేలంపై కోర్టు మే 15న తిరిగి విచారణ నిర్వహించనుంది. దీంతో వచ్చే నెల 8లోపు పీఎన్‌బీ మరోసారి తన అభ్యంతరాలను కోర్టుకు నివేదించుకునేందుకు వీలుంది. 

>
మరిన్ని వార్తలు