బావ అలా చేశారంటే మేమే షాకయ్యాం...

13 Apr, 2018 09:24 IST|Sakshi

బీజింగ్‌ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో పాల్పడిన వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన సెలబ్రిటీల స్టార్‌, డైమాండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం దేశ ప్రజల మాత్రమే కాక, అతని సన్నిహితులు కూడా నీరవ్‌ను చీదరించుకోవడం ప్రారంభించారు. హాంకాంగ్‌లో ఉన్న నీరవ్‌ బావ మయాంక్‌ మెహతా సైతం నీరవ్‌ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బావ పీఎన్‌బీలో రూ.13,600 కోట్ల కుంభకోణానికి పాల్పడటం నిజంగా తమల్ని షాక్‌కి, ఆశ్చర్యానికి గురిచేసిందని నీరవ్‌ సోదరి పూర్వి భర్త మయాంక్‌ మెహతా ఇండియా టుడేతో అన్నారు. 

పూర్వి మెహతా ఫ్లాట్‌లో నీరవ్‌ తలదాచుకున్నాడనే వార్తల నేపథ్యంలో ఇండియా టుడే టీమ్‌, వారిని ఆశ్రయించింది. హాంకాంగ్‌లో వారు నివసించే ఎస్టోరియల్‌ కోర్టు హౌజింగ్‌ కాంప్లెక్స్‌కు వెళ్లిన ఇండియా టుడే టీమ్‌కు తొలుత అక్కడ నిరాశే ఎదురైంది. ఇక్కడ నీరవ్‌ లేదా పూర్వి పేరుతో ఎవరూ లేరంటూ వీరి ముఖం మీదనే ఆ ఫ్లాట్‌లో ఉంటున్న వారు తలుపులు వేసేశారు. అయితే ఈ బిల్టింగ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్న ఆమె, తనకు పూర్వి సోదరుడు మోదీ తెలుసని తెలిపింది. కానీ ఇటీవల మోదీ ఇక్కడ కనిపించలేదని పేర్కొంది. అనంతరం మయాంక్‌తో ఇండియా టుడే మాట్లాడింది. 

మోదీ ఇలా చేస్తారని తాము అసలు ఊహించలేదని, మొత్తం సమస్యను అర్థం చేసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. మోదీ అంకుల్‌ ఎందుకు గూగుల్‌లో కనిపిస్తున్నారంటూ తమ పిల్లలు అడుగుతున్నారని, నిజాలను మాత్రం తోసిపుచ్చలేమని, వారితో తాము ఇక సంబంధాలు పెట్టుకోవాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు. పూర్వి గురించి ప్రస్తావించగా, తన భార్య ట్రావెలింగ్‌లో ఉందని తెలిపారు. అయితే పూర్వి ఫ్లాట్‌లోనే ఉన్నట్టు ఈ బిల్టింగ్‌ స్టాఫ్‌గా పనిచేసే సిబ్బంది చెప్పారు. మోదీ ప్రొవిజనల్‌ అరెస్ట్‌పై స్పందించిన మయాంక్‌.. ఇదే సరియైన ప్రక్రియ అని, మా ఇంటిని ప్రభుత్వం సెర్చ్‌ చేసుకోవచ్చని, మా ఇంట్లో నీరవ్‌ ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తనకు తెలుసని పేర్కొన్నారు. కాగ, ఇటీవలే నీరవ్‌మోదీ హాంకాంగ్‌లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. అతన్ని ప్రొవిజనల్‌ అరెస్ట్‌ చేయాలంటూ హాంకాంగ్‌ అథారిటీలను భారత్‌ కోరింది. దీనిపై హాంకాంగ్‌ సైతం సానుకూలంగా స్పందించింది.

మరిన్ని వార్తలు