నీరవ్ మోదీకి భారీ షాక్

18 Apr, 2020 11:37 IST|Sakshi
నీరవ్ మోదీ (ఫైల్ ఫోటో)

అన్నయ్య అక్రమాల గురించి తెలియదుదర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తా: నీరవ్ తమ్ముడు

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) లో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన ఆరోపణలతో లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. తన అన్న అక్రమాలకు, నేరపూరిత కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపిస్తూ నీరవ్ తమ్ముడు నిషాల్ మోదీ  ముందుకు వచ్చాడు. నీరవ్ మోదీ అవినీతి గురించి తనకు తెలియందటూ నిషాల్ ఈడీని ఆశ్రయించాడు. ఈ మేరకు తాను దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు ఒక లేఖ రాశాడు.

తన వ్యాపార ప్రయోజనాల కోసం బ్యాంకులతో నీరవ్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నదీ తనకు తెలియదనీ, వార్తల్లో వచ్చేంతవరకు తనకు ఈ కుంభకోణం గురించి తెలియదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాననీ, చట్టం ప్రకారం సహాయం చేస్తానని ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆంట్వెర్ప్‌లో ఉన్న తనను కలవాలని ఈడీని కోరారు. నీరవ్ మోదీ సంపదకు తాను లబ్ధిదారుడిని కాదని నొక్కిచెప్పిన నీషల్ ఫైర్‌స్టార్ డైమండ్ డైరెక్టర్‌గా వేతనంతోపాటు వ్యాపారం ద్వారా వచ్చే చట్టబద్ధమైన ఆదాయాన్ని మాత్రమే తాను పొందానని, క్రమం తప్పకుడా పన్నులు కూడా చెల్లించానని రాశాడు. మరోవైపు ఈ లేఖ విషయాన్ని ధ్రువీకరించిన ఈడీ అధికారి ఒకరు నీషల్ నిందితుడు కాబట్టి, అతని సమాచారానికి విలువ వుండదని పేర్కొన్నారు. అంతేకాదు విచారణకు సహకరించదల్చుకుంటే అతనే భారతదేశానికి రావాలని తెలిపారు.

కాగా దాదాపు రూ.14వేల కోట్ల పీఎన్‌బీ స్కాంలో ప్రధాన ఆరోపణలపై నీరవ్ మోదీని 2019 మార్చిలో లండన్‌లో అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో మరో ప్రధాన నిందితుడు అతని మామ మెహుల్ చోక్సీ, నీరవ్ సోదరుడిపై కూడా ఇప్పటికే పలు ఆరోపణలు కింద సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. లండన్‌లోని వాండ్స్‌వర్త్  జైలులో ఉన్న నీరవ్‌ను వీడియో ద్వారా విచారించిన వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు అతడి జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏప్రిల్ 28వ తేదీవరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు