‘రూ 934 కోట్లు సర్దేశాడు’

12 Mar, 2019 13:21 IST|Sakshi

ముంబై : పరారీలో ఉన్న డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీ రూ 934 కోట్లను తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించాడని ప్రత్యేక న్యాయస్ధానంలో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. ఈ మొత్తంలో రూ 560 కోట్లను తన ఖాతాలో వేసుకున్న నీరవ్‌ రూ 200 కోట్లను తన భార్య అమీ ఖాతాలోకి, రూ 174 కోట్లను తండ్రి దీపక్‌ మోదీ వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాలోకి మళ్లించాడని ఈడీ ఆరోపిం‍చింది.

నకిలీ పత్రాలతో పీఎన్‌బీ నుంచి నీరవ్‌ మోదీ  వేల కోట్ల రుణాలను మోసపూరితంగా పొందాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రూ 12,000 కోట్ల పీఎన్‌బీ స్కామ్‌లో నీరవ్‌ ప్రధాన నిందితుడు కాగా, గీతాంజలి జెమ్స్‌ అధినేత నీరవ్‌ బంధువు మెహుల్‌ చోక్సీ కూడా పీఎన్‌బీ స్కామ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

కాగా ఈ కేసులో తాజా వివరాలను పేర్కొంటూ గతవారం ముంబై ప్రత్యేక న్యాయస్ధానంలో ఈడీ అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. తాజా చార్జిషీట్‌తో ఈ కేసులో నీరవ్‌ భార్య అమీ మోదీ సైతం నిందితురాలిగా చేరారు. గత ఏడాది ఈడీ సమర్పించిన తొలి చార్జిషీట్‌లో అమీని నిందితురాలిగా చేర్చలేదు. దర్యాప్తు సంస్థలు నీరవ్‌ మోదీని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన లండన్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు పలు కథనాలు వెల్లడయ్యాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు