నీరవ్‌ మోదీకి మరో షాక్‌

18 Jun, 2018 09:26 IST|Sakshi
పీఎన్‌బీ స్కాంలో కీలక నిందితుడు నీరవ్‌ మోదీ (పాత ఫోటో)

మోదీ చేతిలో ఆరు భారతీయ పాస్‌పోర్టులు

రద్దుచేసిన పాస్‌పోర్ట్‌లతో విదేశాల్లో చక్కర్లు

మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు రంగం సిద్ధం

సాక్షి,న్యూఢిల్లీ: డైమండ్‌ వ్యాపారి, ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌  బ్యాంకుకు వేలకోట్ల రుణాలను ఎగవేసిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీకి మరోషాక్‌ తగిలింది. అతి పెద్ద  పీఎన్‌బీ కుంభకోణంలో (రూ.13,600 కోట్లు) ముంచేసి విదేశాల్లో చక్కర్లుకొడుతున్న నిందితుడు నీరవ్‌ మోదీకి సంబంధించి తాజాగా మరింత కీలక సమాచారాన్ని దర్యాప్తు బృందం అధికారులు సేకరించారు. కనీసం ఆరు భారతీయ పాస్‌పోర్ట్ లతో వివిధ దేశాలలో తిరిగుతున్నట్టు కనుగొన్నారు. ఈ నేరానికి  మోదీపై తాజా ఎఫ్ఐఐఆర్ నమోదు చేయాలని దర్యాప్తు బృందాలు కోరుతున్నాయని సీనియర్ అధికారులు ధృవీకరించారు.  ఒకటి కంటే ఎక్కువ  పాస్‌పోర్ట్‌లను  కలిగి ఉండటం, అలాగే రద్దు చేయబడిన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించడం నేరమని  పేర్కొన్నారు.  

అధికారుల సమాచారం ప్రకారం  నీరవ్‌  మోదీ మొత్తం ఆరు ఇండియన్‌ పాస్ట్‌పోర్టులను  కలిగివుండగా రెండింటిని తరచుగా వాడుతున్నాడు.  మిగిలినవి ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాయి.  ఒక దానిలో మోదీ పూర్తి పేరు ఉండగా, మరొకటి, 40 ఏళ్ళ యూకే వీసాలో ఫస్ట్‌నేమ్‌తో ఉంది. పీఎన్‌బీ స్కాంలో వెలుగులోకి వచ్చిన అనంతరం  ఈ ఏడాది ప్రారంభంలో తన మొదటి పాస్‌పోర్టును, ఆ తరువాత రెండవదాన్ని ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ, వాటిని ఇంకా వినియోగించడం చట్టరీత్యా నేరమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు  బెల్జియం పాస్‌పోర్ట్‌ కూడా ఉంది.  ఈ వ్యవహారంపై  ఒక కొత్త నేరారోపణ కింద  మోదీపై  ఎఫ్ఐఆర్‌ దాఖలు చేయాలని, అంతర్గత విచారణ పూర్తయిన తర్వాత విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని సీనియర్ అధికారి చెప్పారు. అలాగే ఇతర దేశాలు జారీ చేసిన పాస్‌పోర్టులను మోదీ ఉపయోగించినట్లయితే, దానిపై కూడా దర్యాప్తు జరుగుతుందని ఆయన చెప్పారు.

కాగా పీఎన్‌బీ స్కాంలో ఇప్పటికే  మోదీపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.  తమ ఛార్జిషీట్ల ఆధారంగా మోదీతోపాటు ఇతర నిందితులకు  రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి.  మరోవైపు  విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా నీరవ్‌ పాస్‌పోర్ట్‌ రద్దు గురించి ప్రభుత్వం ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించింది. అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు