బెయిల్‌ కోసం మళ్లీ బ్రిటన్‌ కోర్టుకు నీరవ్‌ మోదీ

11 Jun, 2019 16:16 IST|Sakshi

లండన్‌ : పీఎన్‌బీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు, డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీ బెయిల్‌ కోసం మరోసారి బ్రిటన్‌లో ఎగువ కోర్టును ఆశ్రయించారు. నీరవ్‌ మోదీకి గతంలో బెయిల్‌ ఇచ్చేందుకు దిగువ కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. మోదీ అప్పగింత కేసును విచారిస్తున్న వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు ఇప్పటికే ఆయన బెయిల్‌ వినతిని మూడు సార్లు తోసిపుచ్చింది. కాగా మోదీని ఉంచిన వ్యాండ్స్‌వర్త్‌ జైలులో కనీస సౌకర్యాలు లేవని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు నివేదించినా బెయిల్ మంజూరుకు న్యాయస్ధానం అంగకరించలేదు.

వ్యాండ్స్‌వర్త్‌ జైలుకు ప్రత్యామ్నాయంగా మోదీ లండన్‌లోని తన లగ్జరీ ఫ్లాట్‌లోనే 24 గంటల పాటు ఉండేందుకు అనుమతించాలన్న ఆయన న్యాయవాదుల అప్పీల్‌ను కోర్టు అంగీకరించలేదు. పీఎన్‌బీ స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్న మోదీని భారత్‌కు అప్పగించడంపై బ్రిటన్‌ కోర్టులో వాదోపవాదాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నీరవ్‌ మోదీని ఈ ఏడాది మార్చి 20న స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు అరెస్ట్‌​చేశారు. నీరవ్‌ మోదీ, ఆయన మామ మెహుల్‌ చోక్సీలు నకిలీ పత్రాలతో పీఎన్‌బీ నుంచి రూ 11,400 కోట్ల మేర రుణాలు పొంది తిరిగి చెల్లించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు