ఆర్థికమంత్రి ప్యాకేజీ మొత్తం వివరాలు ప్రకటిస్తారా?

13 May, 2020 11:40 IST|Sakshi
ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (ఫైల్‌ ఫోటో)

ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌  ప్రెస్‌మీట్‌పై ఆసక్తి

ప్యాకేజీ వివరాలపై  సర్వత్రా ఉత్కంఠ

సాక్షి,  న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన  ఆర్థిక ప్యాకేజీపై సర్వత్రా  ఆసక్తినెలకొంది. మరోవైపు ఈ మెగా ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌ వివరాలను ప్రకటించనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. ప్రధాని ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేయబోతున్నారని  ఊహాగానాలు భారీగా నెలకొన్నాయి.  రూ.20 లక్షల కోట్లను ఏయే రంగాలకు ఎంత కేటాయించేదీ వివరించనున్నారనే అంచనాలు నెలకొన్నాయి. (మెగా ప్యాకేజీ ‌ : భారీ లాభాలు)

మరోవైపు మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై ట్విటర్‌ లో స్పందించిన నిర్మలా సీతారామన్‌ ఇది కేవలం ఆర్థిక ప్యాకేజీ మాత్రమే కాదని, సంస్కరణ ఉద్దీపన, తమ పాలనలో  నిబద్థతకు నిదర్శమని ట్వీట్‌ చేశారు.   భారత ఆర్థిక వ్యవస్థ  వివిధ కోణాలలో బలాన్ని పొందింది.  ఇక ఇపుడు ప్రపంచంతో నమ్మకంగా  మమేకం కావచ్చు. కేవలం ఇంక్రిమెంటల్‌​ మార్పులు మాత్రమే కాదు, మొత్త  పరివర్తననే లక్ష్యంగా పెట్టుకున్నాం. మహమ్మారి విసిరిన సవాలును అవకాశంగా మార్చుకున్నాం.  ఐసోలేషన్‌ కాదు ఆత్మ నిర్భర్‌ భారత్‌  మనల్ని ఏకీకృతం చేస్తుందంటూ ఆమె వరుస ట్వీట్లలో  పేర్కొన్నారు. 

అయితే రాబోయే రోజుల్లో  ఆర్థికమంత్రి  ఈ ఆర్థిక ప్యాకేజీ గురించి సవివరమైన సమాచారం ఇస్తారని మోదీ చెప్పిన నేపథ్యంలో  ప్యాకేజీ వివరాలన్నీ ఇపుడే ప్రకటిస్తారా లేదా విడతల వారీగా ఉపశమనాన్ని ప్రకటిస్తారా అనేది స్పష్టత లేదు. మొత్తం వివరాలను ఒకేసారి ప్రకటించకపోవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే మొత్తం ప్యాకేజీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తించే అవకాశం లేదనీ, ఇది బహుశా కొన్ని సంవత్సరాలు అంటే 2022  వరకు లేదా అంతకు మించి వ్యవధిలో వుంటుందని అంచనా.  ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొన్న భూమి, కార్మికులు, చట్టం లాంటి  అంశాల్లో   సంస్కరణ చర్యల ప్రభావం  దీర్ఘకాలికంగా దాదాపు  3-5  సంవత్సరాలు వుండొచ్చని పేర్కొంటున్నారు. 

కాగా మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి అదనంగా దేశ జీడీపీలో 10శాతం ఆర్థిక పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించిన సంగతి  తెలిసిందే. కుటీర పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమ, ఎంఎస్‌ఎంఇలు, కార్మికులు, రైతులు, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు, భారతీయ పరిశ్రమలు  లాంటి వివిధ విభాగాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక ప్యాకేజీ రూపొందించినట్టు మోదీ వెల్లడించారు.

చదవండి : కరోనా : ట్విటర్‌ సంచలన నిర్ణయం

మరిన్ని వార్తలు