బ్యాంకింగ్‌ బాహుబలి!

31 Aug, 2019 05:21 IST|Sakshi

ప్రభుత్వ బ్యాంకుల మెగా విలీనానికి సై...

10 బ్యాంకులు 4 బ్యాంకులుగా కుదింపు

వీటి మొత్తం వ్యాపార పరిమాణం రూ. 55.81 లక్షల కోట్లు

ప్రభుత్వ రంగంలో 12కి తగ్గనున్న బ్యాంకుల సంఖ్య

విలీనాలతో రుణ వితరణ పెంపు, వృద్ధికి ఊతం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

బ్యాంకింగ్‌లో గవర్నెన్స్‌పరంగా మరిన్ని సంస్కరణలు

జవాబుదారీతనం పెంచే చర్యలు  

బంపర్‌ మెజారిటీతో రెండోసారి అధికార పగ్గాలు దక్కించుకున్న మోదీ సర్కారు.. సంస్కరణల మోత మోగిస్తోంది. ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఇటీవలే ఉద్దీపనలతో చికిత్స చేసిన కేంద్రం... తాజాగా ‘ఎఫ్‌డీఐ 2.0’ ద్వారా దేశంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బ్యాంకింగ్‌ రంగంలో మెగా విలీనాలకు తెరతీసింది. మొండి బాకీలతో కునారిల్లుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు దివ్యౌషధం లాంటి చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

మొత్తం 10 బ్యాంకులను విలీనం చేసి 4 బ్యాంకులకు పరిమితం చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి ఇప్పుడు 12కు చేరనుంది. ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకుల జాతీయీకరణ జరిగి ఈ ఏడాదికి 50 ఏళ్లు అయిన తరుణంలో ప్రభుత్వ బ్యాంకులను భారీస్థాయిలో విలీనం చేసి వాటి సంఖ్యను పరిమితం చేసేలా కీలక నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం చేపట్టడం గమనార్హం. మొత్తం మీద దాదాపు నెల రోజుల వ్యవధిలోనే అటు కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు వంటి సంచలన నిర్ణయంతో పాటు ఇటు ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా సాహసోపేతమైన చర్యలు వెలువడటం విశేషం.  

న్యూఢిల్లీ:  ఎస్‌బీఐ, బీవోబీల్లో ఇతర బ్యాంకుల విలీనాలకు కొనసాగింపుగా మరిన్ని భారీ బ్యాంకులు ఏర్పాటు చేస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి ఏకంగా పది బ్యాంకుల విలీనాన్ని ప్రకటించింది. దీని ప్రకారం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) ఆరు విలీనం కానున్నాయి. దీంతో పీఎస్‌బీల సంఖ్య 12కి తగ్గనుంది. వీటి వ్యాపార పరిమాణం ఏకంగా రూ. 55.81 లక్షల కోట్లుగా ఉండనుంది. 2017లో పీఎస్‌బీల సంఖ్య 27గా ఉండేది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. అలాగే పీఎస్‌బీల్లో గవర్నెన్స్‌పరమైన పలు సంస్కరణలను కూడా ఆవిష్కరించారు. బోర్డులకు స్వయంప్రతిపత్తి ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘మేనేజ్‌మెంట్‌ జవాబుదారీతనాన్ని పెంచే దిశగా.. జీఎం నుంచి ఎండీ దాకా అందరి పనితీరు గురించి జాతీయ బ్యాంకుల బోర్డు కమిటీ మదింపు చేస్తుంది‘ అని ఆమె తెలిపారు. 10 బ్యాంకుల ఖాతాలను పటిష్టంగా మార్చేందుకు రూ. 52,250 కోట్ల మేర నిధులు అందించనున్నట్లు వివరించారు. విలీన ప్రక్రియలో ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్, రాజీవ్‌ కుమార్‌

బ్యాంక్‌ల విలీనం

నెక్ట్స్‌జెన్‌ బ్యాంకులతో వృద్ధికి ఊతం ..
‘దేశవ్యాప్తంగా పటిష్టమైన నెట్‌వర్క్, అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలుండే బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కార్యకలాపాల వృద్ధితో ఆయా బ్యాంకులకు మరిన్ని వనరులు అందుబాటులోకి వస్తాయి. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడానికి అవకాశం ఉంది. నెక్ట్స్‌జనరేషన్‌ బ్యాంకులను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం‘ అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.  
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద పన్ను సర్‌చార్జీల తొలగింపు, బ్యాంకింగ్‌ రంగంలో లిక్విడిటీ పెంచడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. అలాగే, బొగ్గు మైనింగ్‌ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడి నిబంధనలను కేంద్రం సరళతరం చేసింది. రాబోయే రోజుల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా ఉద్దీపన ప్యాకేజీలాంటిదేమైనా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఇవన్నీ కూడా ఎకానమీని మందగమనం కోరల నుంచి బయటపడేయగలవని ప్రభుత్వం ఆశిస్తోంది.   

ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు..
► ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) లాభదాయకత మెరుగుపడుతోంది. పీఎస్‌బీల్లో అమలు చేస్తున్న సంస్కరణలు ఫలితాలివ్వడం మొదలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 14 బ్యాంకులు లాభాలు నమోదు చేశాయి.
► 2018 డిసెంబర్‌ ఆఖరు నాటికి రూ. 8.65 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం స్థూల మొండిబాకీలు 2019 మార్చి ఆఖరు నాటికి రూ. 7.9 లక్షల కోట్లకు తగ్గాయి.
► పాక్షిక రుణ హామీ పథకం అమలుతో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), గృహ రుణాల సంస్థల (హెచ్‌ఎఫ్‌సీ)కు నిధులపరమైన తోడ్పాటు మెరుగుపడింది. ఇప్పటికే రూ. 3,300 కోట్ల మేర నిధులు అందించగా, మరో రూ. 30,000 కోట్లు అందుబాటులోకి రానున్నాయి.
► నీరవ్‌ మోదీ తరహా మోసాలను నివారించేందుకు స్విఫ్ట్‌ మెసేజింగ్‌ వ్యవస్థను కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు (సీబీఎస్‌)కు అనుసంధానించడం జరిగింది.  
► విలీనానంతరం వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆయా బ్యాంకుల బోర్డులు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌లను ఏర్పా టు చేసుకోవచ్చు. చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌లను కూడా నియ మించుకోవాల్సి ఉంటుంది.  
► సమర్ధులను ఆకర్షించేందుకు మార్కెట్‌కు అనుగుణమైన ప్యాకేజీని ఇవ్వొచ్చు. స్వతంత్ర డైరెక్టర్ల సిటింగ్‌ ఫీజు నిర్ణయించుకునే  వెసులుబాటు బ్యాంకు బోర్డులకు ఉంటుంది.
 

 మొత్తం మెగా బ్యాంకులు: 6
ఎస్‌బీఐ
బీవోబీ
పీఎన్‌బీ
కెనరా బ్యాంక్‌   
 ఇండియన్‌ బ్యాంక్‌
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

మిగిలిన చిన్న బ్యాంకులు: 6
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌
యూకో బ్యాంక్‌  
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌

బందరు బ్యాంకు.. ఇక కనుమరుగు
దశాబ్దాలుగా తెలుగు ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు అందించిన మన ఆంధ్రా బ్యాంకు తాజా బ్యాంకుల విలీన ప్రతిపాదనతో ఇక కనుమరుగు కానుంది. మరో నాలుగేళ్లలో వందేళ్లు పూర్తి చేసుకోనుండగా ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. బందరు బ్యాంకు అని కూడా అభిమానంగా పిల్చుకునే ఆంధ్రా బ్యాంకును ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య .. 1923లో మచిలీపట్నంలో ప్రారంభించారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌కు ప్రధాన కార్యాలయం మారింది.

1980లలో జరిగిన రెండో విడత బ్యాంకుల జాతీయీకరణతో ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. అయితే, కొన్నాళ్లుగా మొండిబాకీలు పేరుకుపోయి ఆంధ్రాబ్యాంకు అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. మరో బ్యాంకులో విలీనం చేస్తారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో విలీనంతో వాటికి తెరపడింది. ఇప్పటికే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌.. ఎస్‌బీఐలో విలీనం కావడంతో మొత్తానికి తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా పనిచేసే రెండు బ్యాంకులు కనుమరుగయినట్లే. ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రా బ్యాంకుకు 2,885 దాకా శాఖలు, 3,798 ఏటీఎంల నెట్‌వర్క్‌ ఉంది. మొత్తం డిపాజిట్లు రూ. 2,19,853 కోట్లు. రుణాలు రూ. 1,58,848 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 2,54,044 కోట్లు.   

భారీ బ్యాంకుల సత్తా ఇది..
‘5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీని సాధించే దిశగా భారీ బ్యాంకింగ్‌ వ్యవస్థ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందన్న విషయం ఈ విలీనాల ప్రతిపాదనలతో తెలుస్తోంది. వేగం గా వృద్ధి చెందుతున్న మనలాంటి దేశం.. రు ణాల అవసరాలను తీర్చేందుకు భారీ బ్యాం కులు మరింత సన్నద్ధంగా ఉంటాయి. పదే పదే ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతం గా నిధులను కూడా సమీకరించుకోగలవు‘
– రజనీష్‌ కుమార్, చైర్మన్, ఎస్‌బీఐ

వారానికో సంస్కరణ టానిక్‌..  
‘బ్యాంకుల విలీన ప్రకటన నా వారాంతపు ప్రణాళికలను మార్చేసింది. చేయాల్సిన పని బోలెడంత ఉంది. అయితేనేం.. నేను చాలా ఆశావహంగా ఉన్నాను. విలీన ప్రతిపాదనలు స్వాగతిస్తున్నా. ప్రస్తుతం మనకు ’వారానికో సంస్కరణ’ టానిక్కు కావాల్సిందే‘
– ఆనంద్‌ మహీంద్రా,  చైర్మన్, మహీంద్రా గ్రూప్‌


ఆలనాటి ఆంధ్రాబ్యాంక్‌

విలీన బ్యాంకుల సంగతి ఇదీ...
కార్పొరేషన్‌ బ్యాంకు
సుమారు 113 ఏళ్ల క్రితం 1906లో కార్పొరేషన్‌ బ్యాంకు ఏర్పాటైంది. మంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం 2,600 పైచిలుకు సీబీఎస్‌ బ్రాంచీలు, 3,000 పైగా ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. రూ. 1,84,564 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,21,251 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 2,13,624 కోట్లు.   

 యూనియన్‌ బ్యాంకు
సుమారు 99 ఏళ్ల క్రితం 1919లో ఏర్పాటైంది. ముంబై కేంద్రంగా పనిచేస్తోంది. 4,300 పైగా శాఖలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 4,17,505 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 2,98,780 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 4,98,580 కోట్లు.    

కెనరా బ్యాంకు
కెనరా బ్యాంక్‌ హిందు పర్మనెంట్‌ ఫండ్‌గా 1906లో ఏర్పాటైన ఈ బ్యాంకు 1910లో కెనరా బ్యాంక్‌ లిమిటెడ్‌గా మారింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకుకు సుమారు 6,310 శాఖలు, 8,851 ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. రూ. 5,99,123 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 4,28,114 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 7,11,783 కోట్లు.  

సిండికేట్‌ బ్యాంకు
కెనరా ఇండస్ట్రియల్‌ అండ్‌ బ్యాంకింగ్‌ సిండికేట్‌గా 1925లో ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత సిండికేట్‌ బ్యాంక్‌గా మారింది. కర్ణాటకలోని మణిపాల్‌ కేంద్రంగా పనిచేస్తోంది. సుమారు 4,063 శాఖలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 2,59,883 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 2,05,044 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 3,12,971 కోట్లు.  

 అలహాబాద్‌ బ్యాంకు
సుమారు 154 ఏళ్ల క్రితం 1865లో ఈ బ్యాంకు ఏర్పాటైంది. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తోంది. గతేడాది మార్చి నాటి గణాంకాల ప్రకారం సుమారు 3,503 శాఖలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 2,14,330 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,42,212 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 2,49,577 కోట్లు.  

ఇండియన్‌ బ్యాంకు
దాదాపు 112 ఏళ్ల క్రితం 1907లో ఏర్పాటైంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తోంది. 2,900 దాకా శాఖలు, 2,861 ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 2,42,041 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,81,262 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 2,80,388 కోట్లు.  

పీఎన్‌బీ 
నూట పాతికేళ్ల క్రితం 1894లో పీఎన్‌బీ ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. గతేడాది అక్టోబర్‌ దాకా గల గణాంకాల ప్రకారం సుమారు 7,000 పైగా శాఖలు, 10,681 ఏటీఎంల నెట్‌వర్క్‌ ఉంది. మొత్తం డిపాజిట్లు రూ. 6,81,874 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 4,62,416 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 7,89,266 కోట్లు. (కన్సాలిడేటెడ్‌ గణాంకాలు)

ఓబీసీ
స్వాతంత్య్రం రావడానికి కొన్నాళ్ల ముందుగా 1943లో లాహోర్‌లో ఏర్పాటైంది. ప్రస్తుతం గురుగ్రామ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. దాదాపు 2,700 శాఖలు, 2,621 ఏటీఎంల నెట్‌వర్క్‌ ఉంది. మొత్తం డిపాజిట్లు రూ. 2,32,645 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,59,285 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ. 2,71,910 కోట్లు.  

యునైటెడ్‌ బ్యాంక్‌  
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నాలుగు బెంగాలీ బ్యాంకుల విలీనంతో 1950లో యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటైంది. కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం 1,999 శాఖలు, కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 1,34,983 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 66,955 కోట్లు. మొత్తం అసెట్స్‌ రూ.1,51,530 కోట్లు.

మరిన్ని వార్తలు