రాజన్ వ్యాఖ్యలు సరికాదు

19 Apr, 2016 00:49 IST|Sakshi
రాజన్ వ్యాఖ్యలు సరికాదు

గుడ్డివాళ్లు, ఒంటికన్ను రాజు కాకుండా మంచి పదాలు వాడాల్సింది: నిర్మలా
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ గుడ్డివాళ్ల లోకంలో ఒంటికన్ను రాజులా ఉందన్న ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలను కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుపట్టారు. భారత ఆర్థిక వ్యవస్థను వర్ణించడానికి రఘురామ్ రాజన్ మంచి మాటలు వాడి ఉండివుంటే బావుండేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెరుగుతున్నాయని, తయారీ రంగం పుంజుకుం టోందని, ద్రవ్యోల్బణం, కరంట్ అకౌంట్ లోటు నియంత్రణలోనే ఉన్నాయని వివరించారు.

రాజన్ చెప్పాలనుకున్న భావాన్ని మంచి పదాలు, మాటలతో చెబితే బావుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ ఆశావహంగా ఉందని  వర్ణించే రాజన్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుడ్డివాళ్ల లోకంలో ఒంటి కన్ను రాజులా భారత ఆర్థిక వ్యవస్థ ఉందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు